సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బాలీవుడ్‌ను మళ్లీ వణికిస్తున్న అండర్‌వరల్డ్.. సల్మాన్ ఖాన్ చుట్టూనే అసలు కథ?

ABN, Publish Date - Oct 19 , 2026 | 09:07 PM

ఒకప్పుడు బాలీవుడ్ అంటే సినిమాలు, స్టార్ల హవా మాత్రమే కాదు.. అండర్‌వరల్డ్ బెదిరింపుల భయం కూడా. నిర్మాతల నుంచి హీరోల వరకు గ్యాంగ్‌స్టర్ల హెచ్చరికల మధ్య బతికిన ఆ రోజులు ముగిశాయని భావిస్తున్న తరుణంలో.. మళ్లీ వరుస కాల్పులు, బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

Bollywood Underworld

ఒకప్పుడు అండర్‌ వరల్డ్‌ నీడలో వణికిన బాలీవుడ్‌.. ఇప్పుడు మళ్లీ అదే చీకట్లోకి జారుకుంటోందా..? తుపాకీ మోతలు ఆగిపోయాయనుకున్న ముంబైలో మళ్లీ బుల్లెట్ల కలకలం ఎలా చూడాలి..? లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో సాగుతున్న ఈ బెదిరింపుల వెనుక అసలు ఉద్దేశం ఏంటి..? సల్మాన్‌ ఖాన్‌తో సంబంధాలు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారా..? లేక బాలీవుడ్‌లో భయాన్ని ఆయుధంగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారా..? రోహిత్‌ శెట్టి ఇంటి దగ్గర కాల్పుల ఘటన నుంచి.. రణ్‌వీర్‌ సింగ్‌కు వచ్చిన బెదిరింపుల వరకు.. బాబా సిద్ధిఖీ హత్య నుంచి ఇతర సెలబ్రిటీలకు అందుతున్న హెచ్చరికల వరకు.. వరుస ఘటనలు ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

బాలీవుడ్‌ను అండర్‌ వరల్డ్‌ భయం వెంటాడుతోందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు అండర్‌ వరల్డ్‌ బాలీవుడ్‌ను శాసించింది. నిర్మాతల నుంచి హీరోల వరకు.. సంగీత దర్శకుల నుంచి సినీ ప్రముఖుల వరకు.. ఎవరు ఏ సినిమా తీయాలి..? ఎవరు ఎవరితో పని చేయాలి..? అన్నది కూడా గ్యాంగ్‌స్టర్ల బెదిరింపుల మధ్య నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. కాదంటే కాల్పులు.. ఎదురు తిరిగితే ప్రాణాలకే ముప్పు.. ఆ చీకటి రోజులు చరిత్రలో కలిసిపోయాయని అనుకుంటున్న సమయంలో.. మళ్లీ అదే భయం బాలీవుడ్‌ను వెంటాడుతోంది.

అది అక్టోబర్ 18, ఆదివారం ముంబైలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ కారుపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ ప్రాణాలతో బయటపడ్డారు కానీ, ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సల్మాన్ ఖాన్‌తో ఎవరూ పని చేయకూడదని హెచ్చరిస్తూ.. ఈ దాడికి తమదే బాధ్యత అని బిష్ణోయ్ గ్యాంగే స్వయంగా ప్రకటించుకుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఎనిమిది నెలల క్రితం ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి బయట కూడా ఇలాగే కాల్పులు జరగడం, రణ్‌వీర్ సింగ్‌కు ఎక్స్‌టార్షన్ బెదిరింపులు రావడం గమనిస్తే ఈ ముప్పు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే ఈ మొత్తం గొడవకు మూలం సల్మాన్ ఖానే అని స్పష్టంగా తెలుస్తోంది.

1998 నాటి కృష్ణజింకల హత్యాకాండ కేసుతో మొదలైన లారెన్స్ బిష్ణోయ్ కక్షే సల్మాన్ ఖాన్‌ను నిత్యం టార్గెట్ చేస్తూ వస్తోంది. దీనికి కొనసాగింపుగా 2024 ఏప్రిల్‌లో సల్మాన్ బాంద్రాలోని నివాసం బయట బైక్‌లపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాదు, సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా బెదిరింపులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ గ్యాంగ్ కేవలం సల్మాన్‌నే కాకుండా ఆయన సన్నిహితులను సైతం వదలడం లేదు. 2023 నవంబర్‌లో కెనడాలో పంజాబీ నటుడు-గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇల్లు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. సల్మాన్‌తో అతనికి ఉన్న పరిచయమే ఈ దాడికి కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయి. అయితే గిప్పీ గ్రేవాల్ మాత్రం తాను సల్మాన్‌కు అంత సన్నిహితుడిని కాదని తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.

అయితే, 2024 అక్టోబర్ 12న జరిగిన మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖీ హత్య ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడైన బాబా సిద్ధిఖీని ముంబైలోనే దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్యకు కూడా బిష్ణోయ్ గ్యాంగే బాధ్యత వహించింది. సల్మాన్‌తో ఆయనకున్న స్నేహమే ఈ హత్యకు కారణమని ఆరోపించింది. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కేవలం బెదిరింపులతో ఆగిపోకుండా ప్రాణాలు తీసే వరకు వెళ్తారని తెలియడంతో సెలబ్రిటీల్లో భయం మరింత పెరిగింది. సల్మాన్ సర్కిల్‌లో ఉన్నవారే కాకుండా ఈ లిస్ట్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 2024 అక్టోబర్‌లో కమెడియన్ మునావర్ ఫరూఖీకి కూడా ప్రాణహాని బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు. ఇక కపిల్ శర్మ కెనడా కేఫ్‌పై 2025లో ఏకంగా మూడుసార్లు కాల్పులు జరిగాయి. ఈ కేఫ్ ప్రారంభోత్సవానికి సల్మాన్ ఖాన్ హాజరు కావడమే ఈ దాడికి కారణమని బిష్ణోయ్ గ్యాంగ్ లింక్ పెట్టింది.

ఈ ఏడాది అంటే 2026 జూలైలో అమీర్‌ ఖాన్‌ను కూడా ఈ బెదిరింపులు తాకాయి. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులమని చెప్పుకుంటూ సోషల్ మీడియా ద్వారా, ఆడియో మెసేజ్‌ల పంపారు. అమీర్‌ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ కొందరు హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే 2026 ఫిబ్రవరిలో నటుడు రణ్‌వీర్ సింగ్‌కు 10 కోట్లు డిమాండ్ చేస్తూ వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆయనతో పాటు ఆయన స్టాఫ్‌కు కూడా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇదే ఫిబ్రవరిలో సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.

ఇక, 1990ల నాటి నేర చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి భయాలే అప్పట్లోనూ ఉండేవి. 1997లో మ్యూజిక్ బారన్ గుషన్ కుమార్ హత్య, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ముకేష్ దుగ్గల్ కాల్చివేత, 2000 సంవత్సరంలో డైరెక్టర్ రాకేష్ రోషన్ పై జరిగిన కాల్పుల ఘటనలు ఇండస్ట్రీని గడగడలాడించాయి. అప్పట్లో క్రిమినల్ నెట్‌వర్క్‌లు సినిమారంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి ఇలాగే భయపెట్టేవి. ఇప్పుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన తాజా దాడి ఈ హింసాత్మక పరంపరలో మరో కలవరపెట్టే అధ్యాయంగా నిలుస్తోంది.

Updated Date - Oct 19 , 2026 | 09:07 PM