సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఖాన్స్ పని అయిపోయిందనడం సరికాదు!

ABN, Publish Date - Mar 25 , 2026 | 06:09 PM

తాజా విజయాలతో బాలీవుడ్‌లో ఖాన్స్, కపూర్స్ పని అయిపోయిందనడం తొందరపాటు చర్యేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమీర్‌, సల్మాన్‌, షారుఖ్‌ విజయాలను విస్మరించలేమని వారు అంటున్నారు.

Bollywood Star Heroes

బాలీవుడ్‌లో కొన్ని దశాబ్దాలుగా కపూర్స్, ఖాన్స్ రాజ్యమేలారు. ఇప్పుడు వారి ప్రభ తరిగిపోతోందని అంటున్నారు కొందరు. అది సాధ్యమేనా అన్నది ఇంకొందరి అనుమానం.

గత సంవత్సరం టాప్ త్రీ బాలీవుడ్ మూవీస్‌ను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్‌లో 'ధురంధర్', సెకండ్ ప్లేస్‌లో 'ఛావా', థర్డ్ లో 'సైయారా' ఉన్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఖాన్స్ కానీ, కపూర్స్ కానీ లేకపోవడం గమనార్హం అంటున్నారు బాలీవుడ్ బాబులు. ఇక ఈ యేడాది ఇప్పటిదాకా టాప్ గ్రాసర్ ఏది అంటే 'ధురంధర్-2' అనే చెప్పాలి. ఈ లెక్కలు చూసి కొందరు ఇక ఖాన్స్‌కు, కపూర్స్‌కు కాలం చెల్లినట్టే అంటున్నారు. ఏదో ఒకటి రెండు సంవత్సరాల్లో ఖాన్స్ కానీ, కపూర్స్ కానీ టాప్ పొజిషన్‌లో లేక పోయినంత మాత్రాన వారి ప్రభ తరిగి పోయిందనుకుంటే పొరబాటే అంటున్నారు పరిశీలకులు. ఆ మాటకొస్తే 'బాహుబలి-2'ను కూడా క్రాస్ చేసిన ఏకైక స్టార్‌గా ఆమిర్ ఖాన్ 'దంగల్'తో నిలిచారు. అలాగే ఒకే యేడాది వెయ్యి కోట్ల చిత్రాలు 'పఠాన్, జవాన్'తో సందడి చేసిన ఏకైక స్టార్ షారుఖ్ అనిపించుకున్నారు. అలాంటప్పుడు తొందరపడి ముందే ఏమీ చెప్పలేమని కొందరి మాట!


ఖాన్స్, కపూర్స్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఇతర హీరోలెవరూ అంటే అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్ అనే చెప్పాలి. అక్షయ్ కుమార్ ఒకప్పుడు ఖాన్స్‌కు బెంబేలెత్తిస్తూ వరుస విజయాలతో సాగారు. ఇక హృతిక్ రోషన్ సోలో హీరోగానే 'క్రిష్' సిరీస్‌తో బంపర్ హిట్స్ పట్టేశారు. అయినా పాతికేళ్ళ బ్లాక్ బస్టర్స్ జాబితా తీస్తే ఖాన్స్‌దే ఈ నాటికీ పైచేయిగా ఉంది. ఇక 'గోల్డెన్ ఎరా'లో రాజ్యమేలిన కపూర్స్ సైతం అంతకు ముందు భలేగా సాగారు. నవతరం కపూర్స్ లో రణబీర్ కపూర్ తన సత్తా చాటుతున్నారు. ఆయన నటించిన 'యానిమల్, బ్రహ్మాస్త్ర' వంటి చిత్రాలు బంపర్ హిట్స్ గా నిలిచాయి. మన దేశంలోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతోన్న పౌరాణిక చిత్రం 'రామాయణ'లోనూ రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాంటప్పుడు ఖాన్స్, కపూర్స్‌కు కాలం చెల్లింది అంటే సబబు కాదని పరిశీలకులు అంటున్నారు.


'ధురంధర్' సిరీస్‌తో రణవీర్ సింగ్ కూడా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన రెండు చిత్రాలు కలిగిన హీరోగా నిలవనున్నారు. ఈ రికార్డ్ ప్రస్తుతం ప్రభాస్, షారుఖ్ ఖాన్‌కు మాత్రమే ఉంది. వారి తరువాత వెయ్యి కోట్ల క్లబ్‌లో రెండు చిత్రాల హీరోగా రణవీర్ కూడా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఖాన్స్, కపూర్స్‌కు రణవీర్ చెక్ పెట్టబోతున్నారని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. షారుఖ్ ఖాన్ తన 'కింగ్' సినిమాతో ఈ యేడాది డిసెంబర్‌లో రానున్నారు. సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' అనే ప్రతిష్ఠాత్మక చిత్రంతో పలకరించబోతున్నారు. అలాగే రణబీర్ కపూర్ 'రామాయణ' మొదటి భాగం దీపావళి కానుకగా వెలుగు చూడనుంది. ఆ సినిమాల ఫలితాలను చూశాకే వారి టైమ్ అయిపోయిందో లేదో తెలుస్తుంది. అప్పటి దాకా ఆగాల్సిందే.

Updated Date - Mar 25 , 2026 | 06:09 PM