War 2: ‘వార్ 2’ ఫ్లాప్‌పై అయాన్ ముఖర్జీ షాకింగ్ కామెంట్స్..
ABN, Publish Date - Nov 23 , 2026 | 11:06 PM
వార్ 2’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయామని IFFI వేదికగా వెల్లడించారు.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ (War 2) ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫలితంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 57వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికగా మాట్లాడిన ఆయన.. సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని, అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయామని అంగీకరించారు.
ఈ సందర్భంగా అయాన్ మాట్లాడుతూ.. “‘వార్’ మొదటి భాగానికి నేను దర్శకత్వం వహించలేదు. అది నేను రాసిన కథ కూడా కాదు. కేవలం దర్శకత్వ బాధ్యతలు మాత్రమే చేపట్టాను. యష్ రాజ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో, ఆదిత్య చోప్రా నాయకత్వంలో, మొదటి భాగానికి పనిచేసిన రచయితలు, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన కథకు నేను దర్శకత్వం వహించాను. అందుకే ‘వార్ 2’ నాకు భిన్నమైన అనుభవం. ‘వార్ 2’ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఇది మరో సంస్థకు చెందిన ప్రాజెక్ట్ అయినప్పటికీ, దర్శకుడిగా నా వంతు పూర్తి ప్రయత్నం చేశాను. మా టీమ్ అంతా ఎంతో శ్రమించింది. మొదటి భాగం కంటే మరింత గొప్పగా సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావించాం. కానీ మేము ఆశించిన ఫలితం దక్కలేదు. సినిమా విషయంలో మా ప్రయత్నం నిజాయితీగానే ఉంది. అయితే అనుకున్నట్లుగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాం. చిత్ర పరిశ్రమలో ఇలాంటివి సహజమే” అని అయాన్ ముఖర్జీ స్పష్టం చేశారు. ‘వార్ 2’ ఫలితంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.