అభిమానుల ప్రేమతో మళ్లీ కెమెరా ముందుకు అరుణా ఇరానీ
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:28 PM
భర్త కుకు కొహ్లీ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన ప్రముఖ నటి అరుణా ఇరానీ, అభిమానుల ప్రేమ, సినీ ప్రముఖుల మద్దతుతో కోలుకుని తిరిగి నటన ప్రారంభించారు. తనకు అండగా నిలిచిన అభిమానులకు వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ నటీమణి అరుణా ఇరానీ తిరిగి కెమెరా ముందుకొచ్చారు. ఆమె భర్త, ప్రముఖ దర్శకనిర్మాత కుకు కొహ్లీ ఈ యేడాది ఆగస్ట్ 25న గుండెపోటుతో కన్నుమూశారు. హిందీలో పలు విజయవంతమైన చిత్రాలను ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అజయ్ దేవ్ గన్ నటించిన 'ఫూల్ ఔర్ కాంటే'కు ఆయనే దర్శకుడు. 77 సంవత్సరాల వయసులో కుకు కొహ్లీ హఠాన్మరణంతో అరుణా ఇరానీ తల్లడిల్లిపోయారు. ఈ రెండు నెలల్లో పలువురు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు ఆమెకు బాసటగా నిలిచారు. దాంతో కొంత కోలుకున్న అరుణా ఇరానీ ఇప్పుడు తిరిగి కెమెరా ముందుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆమె తాజాగా తన అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె మాట్లాడుతూ, 'కుకూ జీ మరణానంతరం మీరంతా చూపించిన ప్రేమ, ఆప్యాతలకు నేనెప్పటికీ కృతజ్ఞురాలిని. ఈ కష్టకాలంలో మీరు నా వెన్నంటి ఉండటాన్ని నేను ఎప్పటికీ మరువను. మీ ప్రేమ, సహకారం కారణంగానే నేను మళ్ళీ మీ ముందు నిలబడగలిగాను. తిరిగి నేను నటనను ప్రారంభించారు. నా తుది శ్వాస వరకూ మీ నుంచి ఇదే ఆప్యాయతానురాగాలు నాకు లభించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. కుకు కొహ్లీకి అరుణా ఇరానీ రెండవ భార్య. వీరికి పిల్లలు లేరు. కుకు కొహ్లీ మొదటి భార్య పిల్లలు సినిమా రంగంలోనే కొనసాగుతున్నారు. అరుణా ఇరానీ వివిధ భాషల్లో వందలాది చిత్రాలలో కీలక పాత్రలను పోషించారు.
ఇవి కూడా చదవండి:
తలైవర్ మ్యాజిక్కే వేరు: ‘జైలర్ 2’ సక్సెస్‌పై నెల్సన్
ప్రభుత్వ లాంఛనాలతో.. ముగిసిన దేవా అంత్యక్రియలు
బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ ర్యాంపేజ్.. తెలుగు రాష్ట్రాల్లో ‘విరోష్’ సందడి