Amitabh Bachchan: బతికి బయటపడ్డాం.. ఆ ప్రమాదం గురించి చెప్పిన బిగ్‌బీ!
ABN, Publish Date - Nov 17 , 2026 | 03:53 PM
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘బతికి బయటపడ్డాం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక కారణమేంటో తెలియక అభిమానులు ఆందోళన చెందారు. ప్రస్తుతం బాలీవుడ్ నటులకు గ్యాంగ్స్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్టుపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో అమితాబ్ తన పాత అనుభవాన్ని పంచుకున్నారు. గతంలో సినిమా షూటింగ్ నిమిత్తం నేపాల్ వెళ్లినప్పుడు ఎదురైన ప్రాణాపాయ పరిస్థితిని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేపాల్‌లో ఉన్నప్పుడు కొందరు కయాకింగ్ చేద్దామని సూచించారు. ఆ క్రీడ ఎంతో సరదాగా ఉంటుందని చెప్పారు. మొదట నేను ఆసక్తి చూపించలేదు. కానీ ఒకసారి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించి అంగీకరించాను. అయితే ఆ చిన్న పడవలో కూర్చొని తెడ్డుతో దిశను నియంత్రించడం అనుకున్నంత సులభం కాదు. పడవను ఒకవైపు తిప్పాల్సి ఉండగా పొరపాటున మరోవైపు మళ్లించడంతో అది ఒక్కసారిగా బోల్తా పడింది. దాంతో నేను నీటిలో పడిపోయాను. పూర్తిగా మునిగిపోతున్నానేమో అనిపించి ఊపిరి ఆడక భయపడ్డాను. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే రెండు చేతులూ పైకెత్తి ఊపాలని, అప్పుడు ఎవరైనా గుర్తించి రక్షిస్తారని ముందే చెప్పారు. అందుకే నీటిలో ఉండగానే చేతులు ఊపుతూ సాయం కోసం ఎదురుచూశాను. కానీ వెంటనే ఎవరూ స్పందించలేదు. చివరకు జలపాతం సమీపంలో ఉన్న ఓ వ్యక్తి మా పరిస్థితిని గమనించి రక్షించేందుకు ముందుకొచ్చాడు. మమ్మల్ని నీటి నుంచి బయటకు తీసుకురావడానికి వారు చాలా కష్టపడాల్సి వచ్చింది’’ అని అమితాబ్ వివరించారు. ఈ ఘటన ఏ సినిమా చిత్రీకరణ సమయంలో చోటుచేసుకుందో ఆయన వెల్లడించలేదు.