సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: రకుల్ ప్రీత్ సింగ్.. ఇంటికి 'సరైనోడు'!

ABN, Publish Date - Jan 27 , 2026 | 12:00 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ముంబైలో తన తాజా చిత్రం షూటింగ్ లో ఉన్నారు. సావకాశంగా ఇటీవల అర్జున్... రకుల్ ప్రీతి సింగ్ ఇంటికి వెళ్ళి ఆమెను కలిశారు. వీరిద్దరూ గతంలో 'సరైనోడు'లో నటించారు.

Rakul Preet Singh - Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ అట్లీ (Atlee) తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీగా, ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పదుకొణే (Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇదిలా ఉంటే... ముంబైలో అల్లు అర్జున్ తన సన్నిహితులను వీలు చూసుకుని, వీలు చేసుకుని కలుస్తున్నాడు. అలా ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Singh) ను అల్లు అర్జున్ కలిసినట్టు తెలుస్తోంది. రకుల్ ఇంటికి డిన్నర్ కు వెళ్ళి బన్నీ తిరిగి వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది.


గతంలో అల్లు అర్జున్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసిన 'సరైనోడు' మూవీతో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అలానే మెగా ఫ్యామిలీతోనూ రకుల్ కు చక్కని అనుబంధం ఉంది. రామ్ చరణ్‌, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సినిమాలలోనూ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. 2021లో వచ్చిన 'కొండపొలం' సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ 2023లో 'భూ' అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటించింది. ఆ తర్వాత స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించలేదు. 2024లో ఆమె వివాహం నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో జరిగింది. అప్పటి వరకూ హైదరాబాద్ లో నివాసం ఉన్న రకుల్ వివాహానంతరం ముంబైకి ఫిష్ట్ అయ్యింది. పెళ్ళి తర్వాత ఆచితూచి సినిమాలను అంగీకరిస్తోంది. అయితే సినిమా రంగంతోనూ, సినీ రంగానికి చెందిన వ్యక్తులతోనూ ఆమె తన అనుబంధాన్ని ఎప్పటిలానే కొనసాగిస్తోంది. అల్లు అర్జున్ - రకుల్ కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ జంటతో సినిమా తీయాలని కొందరు ప్రయత్నించారు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. మరి అల్లు అర్జున్ చొరవతో అట్లీ సినిమాలో రకుల్ ప్రత్యేక పాత్ర ఏదైనా చేస్తుందేమో చూడాలి.

Updated Date - Jan 27 , 2026 | 03:45 PM