రూట్ మార్చిన కేరళ స్టోరీ బ్యూటీ!
ABN, Publish Date - Mar 14 , 2026 | 11:50 AM
ప్రముఖ కథానాయిక అదాశర్మ... తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రను చేస్తోంది. ఆమె టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'సూపర్ వెల్లి' మూవీ రొటీన్ సూపర్ హీరో చిత్రాలకు భిన్నంగా ఉండబోతోందట.
తెలుగుతో పాటు హిందీలోనూ పలు చిత్రాలలో నటించింది అదాశర్మ (Adah Sharma). అయితే ఆమె నటించిన 'ది కేరళ స్టోరీ' (The Kerala Story) మూవీ సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు చర్చలకు తావిచ్చి, ఆమెను వార్తల్లో నిలిపింది. ఆ తర్వాత కూడా అదాశర్మ అలాంటి పాత్రలనే ఎంచుకుంది. అయితే ఇప్పుడు ఆమె రూట్ మార్చింది. లేజీగా ఉండే ఓ సూపర్ హీరో మూవీలో అదాశర్మ నటిస్తోంది. అలసత్వం, అల్లరితనంతో వ్యవహరించే ఈ సూపర్ హీరో మూవీని రాజేశ్ బచ్చాని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా పేరు 'సూపర్ వెల్లి' (Super Velli).
తన కొత్త సినిమా గురించి అదాశర్మ మాట్లాడుతూ, 'చాలామంది 'ది కేరళ స్టోరీ 2' రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి చెప్పమని నన్ను అడుగుతున్నారు. నేను నటించిన సినిమా గురించి మాట్లాడటం సబబు. నటించని సినిమా గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. సీక్వెల్ మూవీలో నటించమని నన్ను అడిగారా లేదా? నేను అంగీకరించానా? లేక తిరస్కరించానా? అనేది కూడా చర్చనీయాంశం కాదు. ఎందుకంటే అది మేకర్స్ కు, నాకు మధ్య జరిగే వ్యవహరం. నిజం చెప్పాలంటే... 'ది కేరళ స్టోరీ' మొదటి భాగానికి, రెండో భాగానికి కథ రీత్యా చాలా తేడా ఉంది' అని తెలిపింది.
ఇక తన కొత్త సినిమా గురించి చెబుతూ, 'ప్రస్తుతం నేను 'సూపర్ వెల్లి' అనే సినిమా చేస్తున్నాను. ఈ పాత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. ఇలాంటి లేజీ సూపర్ హీరోను మీరు గతంలో ఏ సినిమాలోనూ చూసి ఉండరు. ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని ఈ సినిమా ఇస్తుంది' అని అన్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు రాజేశ్ బచ్చాని మాట్లాడుతూ, 'అదాశర్మ 'కమాండో' లోని భావనారెడ్డి పాత్ర నాకు నచ్చింది. సహజమైన నటన, తెలివితేటలు, చురుకుదనం, విచిత్రమైన వ్యక్తిత్వం వీటన్నింటి సమాహారమే ఆ పాత్ర. ఆ సినిమా చూసిన తర్వాత 'సూపర్ వెల్లి'కి అదాశర్మ కరెక్ట్ అనిపించింది. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. ప్రేక్షకులకు కొత్తదనం అందించే సినిమా ఇది' అని అన్నారు. మొత్తం మీద అదాశర్మ తనకున్న ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రను 'సూపర్ వెల్లి'లో చేస్తోందని అనుకోవచ్చు.