అతని వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను... భోరుమన్న మోనాలిసా!
ABN, Publish Date - Mar 25 , 2026 | 04:40 PM
నటి మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. ఫర్మాన్ ఖాన్ తో జరిగిన తన పెళ్ళి లవ్ జీహాద్ కాదని ఆమె స్పష్టం చేశారు.
ప్రయాగరాజ్ కుంభమేళా ఫేమ్ మోనాలిసా మార్చి 11న తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెను సినిమా రంగానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు సనోజ్ మిశ్రా... మోనాలిసా వివాహాన్ని 'లవ్ జీహాద్'తో పోల్చాడు. తాజాగా సనోజ్ మిశ్రా బండారాన్ని మెనాలిసా... కొచ్చిలో జరిగిన మీడియా సమావేశంలో బయటపెట్టింది. తన భర్త ఫర్మాన్ ఖాన్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ సనోజ్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన కుటుంబ సభ్యులపైనా ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇష్టపడి, హిందూ సంప్రదాయం ప్రకారం తాను ఫర్మాన్‌ను వివాహం చేసుకున్నానని, తనది లవ్ జీహాద్ కాదని స్పష్టం చేసింది. తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందని మోనాలిసా పేర్కొంది.
ప్రధానంగా ఆమె సనోజ్ మిశ్రా గురించి మాట్లాడుతూ, 'నాతో సినిమా తీయడానికి వచ్చిన సనోజ్ మిశ్రా సార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు ఇష్టంలేకపోయినా... నన్ను తాకడానికి ప్రయత్నించేవాడు. ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాడు కాదు. నాకు తెలియకుండా సెక్సీ సీన్స్ ను చిత్రీకరించేవాడు. సినిమాల్లో నటించడానికి వచ్చిన మైనర్ బాలికలతో అనుచితంగా ప్రవర్తించేవాడు. ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా నేను ఫర్మాన్ ను పెళ్ళి చేసుకునే సరికీ తట్టుకోలేపోతున్నాడు. మమ్మల్ని చంపేసినా తప్పులేదని వ్యాఖ్యానిస్తున్నాడు. నేనేమీ ఆయనకు పెళ్ళి చేసుకోనని అగ్రిమెంట్ రాసి ఇవ్వలేదు. ఆయన సినిమాను కూడా పూర్తి చేశాను. నాతో పది కోట్ల ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నానని సనోజ్ చెబుతున్నాడు. అది కనీసం మూడు లక్షల విలువ కూడా చేయదు. ఆయన పాల్పడిన అనైతిక కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి. నాతో సనోజ్ మిశ్రా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మా కుటుంబ సభ్యులకు చెప్పినా వారు పట్టించుకోలేదు' అని మోనాలిసా కన్నీటి పర్యంతమైంది. తనను, తన భర్తను చంపుతామని కొందరు బెదరిస్తున్నారని, వారి నుండి తమకు రక్షణ కల్పించమని మోనాలిసా కేంద్ర ప్రభుత్వాన్ని, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.