Kiara Advani: తల్లినయ్యాక.. నా జీవితం పూర్తిగా మారిపోయింది
ABN, Publish Date - May 11 , 2026 | 11:03 AM
తల్లి అయిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందని కియారా అడ్వానీ తెలిపారు. పోస్ట్‌పార్టమ్ ఫేజ్‌లో ఎదురైన సవాళ్లు, సిద్ధార్థ్ మల్హోత్రా ఇచ్చిన మద్దతుపై ఆమె భావోద్వేగంగా మాట్లాడారు.
తల్లి కావడం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నారు కియారా అడ్వానీ (Kiara Advani ). తాజాగా ఆమె పోస్ట్‌పార్టమ్ (బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే మానసిక స్థితి) ఫేజ్, మాతృత్వం గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ‘మాతృత్వం మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లినయ్యాక నా గుర్తింపు పూర్తిగా మారిపోయింది. బిడ్డ పుట్టాక మొదటి ఆరు నెలలు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాను. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే నేను ఆ సమయంలోనే నాపై నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మొదలుపెట్టాను. నాలోని భావాలను అర్థం చేసుకోవడానికి.. నన్ను నేను ప్రేమించుకోవడానికి ఈ దశ ఎంతో ఉపయోగపడింది.
ఈ కష్టకాలంలో సిద్ధార్థ్ మల్హోత్రా ఎంతో మద్దతు ఇచ్చారు. నా భావోద్వేగాలను డీల్ చేయడానికి ఆయన ఇచ్చిన తోడ్పాటు మానసిక ప్రశాంతతను, బలాన్ని ఇచ్చాయి. ఓ తల్లిగా చాలా విషయాలు నేర్చుకున్నా. ఏవి చేయాలో.. ఏవి చేయకూడదో హద్దులు పెట్టుకున్నా. అలానే నేను చేసే ప్రతీ పనిపై నిఘా ఉంచేదాన్ని. ఎందుకంటే నేను చేసే వాటిని మా అమ్మాయి సరాయా మల్హోత్రా దగ్గరుండి గమనిస్తుంటుంది.
వాటికి తను ఎలా ఫీల్ అవుతుందో అని ఆలోచిందే దాన్ని. ఈ సమయంలో మనలో జరిగే పరిణామాల గురించి మాట్లాడడానికి చాలా మంది సంకోచిస్తుంటారు’ అని పేర్కొన్నారు. బాలీవుడ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా (Sidharth Malhotra)తో 2023లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు కియారా. గతేడాది జూలైలో వారికి ఆడబిడ్డ పుట్టింది. ప్రస్తుతం యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ‘టాక్సిక్’లో నటించారు కియారా అడ్వాణి.