Pradeep Rawat: 'గజిని' విలన్‌కు 'గజిని' హీరో నివాళులు!
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:58 PM
ప్రదీప్ రావత్ అంత్యక్రియలు బుధవారం గోరెగావ్ లో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆమిర్ ఖాన్ సైతం హాజరై నివాళులు అర్పించారు.
ప్రముఖ క్యారెక్టర్ యాక్టర్ ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలోని గోరెగావ్ లో బుధవారం జరిగాయి. గత అయిదేళ్ళుగా కాన్సర్ తో పోరాటం చేస్తున్న ఆయన మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. భివండీలోని హాస్పిటల్ లో ప్రదీప్ రావత్ తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఆయన సహనటుడు, 'లగాన్' ఫేమ్ యశ్ పాల్ శర్మ సోషల్ మీడియాలో పెట్టిన తర్వాతే అందరికీ తెలిసింది. దాంతో ప్రదీప్ రావత్ తో తమకున్న అనుబంధాన్ని తెలుపుతూ ప్రముఖ నటీనటులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తెలుగులోనూ పలువురు నటులు ఆయనతో దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. అందరితో ఎంతో సరదాగా, సన్నిహితంగా మెలిగే ప్రదీప్ రావత్ మృతిని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అసలు ఆయన బ్లడ్ కాన్సర్స్ తో బాధ పడుతున్న విషయమే చాలామందికి తెలియదు.
బుధవారం జరిగిన ప్రదీప్ రావత్ అంత్యక్రియల్లో ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు ఆమిర్ ఖాన్ సైతం పాల్గొన్నారు. తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన సూర్య 'గజిని' సినిమాలో ప్రదీప్ రావత్ ద్విపాత్రాభినయం చేశారు. ఆ చిత్రాన్ని హిందీలో ఆమిర్ ఖాన్ తో రీమేక్ చేసినప్పుడు అక్కడా ఆయనే నటించారు. అలానే దానికి ముందు 'లగాన్' మూవీలోనూ ఆమిర్ తో కలిసి నటించారు ప్రదీప్ రావత్. ఆ అనుబంధాన్ని పురస్కరించుకుని ఆమిర్ ఖాన్... ప్రదీప్ రావత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారని సన్నిహితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, 'రజాకార్' ఫేమ్ రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు హాజరై, ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు.
ఇవి కూడా చదవండి:
ప్రదీప్ రావత్ మృతి.. టాలీవుడ్‌లో స్పందనేది
తండ్రి పాత్రకు పొట్ట బాగా ఉండాలన్నారు.. ఏం చేసేవాడినంటే: త్రినాథరావు నక్కిన
గ్లామర్ డోస్ పెంచితే ఆఫర్స్ వచ్చేస్తాయా రాశీ..