Single Trailer Controversy: హీరో ఇలా... నిర్మాత అలా...
ABN , Publish Date - May 01 , 2025 | 10:26 AM
'సింగిల్' మూవీ ట్రైలర్ లోని అంశాలపై చెలరేగిన వివాదానికి హీరో శ్రీవిష్ణు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించమని కోరాడు.
శ్రీవిష్ణు (Srivishnu) హీరోగా కార్తీక్ రాజు తెరకెక్కించిన సినిమా '#సింగిల్' (Single). గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. వేసవి కానుకగా ఈ మూవీ మే 9న విడుదల కాబోతోంది. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో మంచు కుటుంబాన్ని, ముఖ్యంగా విష్ణు (Manchu Vishnu) ను విమర్శించేలా సంభాషణలు ఉన్నాయని నెటిజన్స్ భావించారు. 'కన్నప్ప' (Kannappa) లో విష్ణు 'శివయ్యా' అని అరవడాన్ని ఈ ట్రైలర్ లో శ్రీవిష్ణు ఇమిటేట్ చేశాడు. అలానే క్లయిమాక్స్ లో మంచు పదాన్ని ఉపయోగిస్తూ పెట్టిన డైలాగ్ ఆ కుటుంబాన్ని ఉద్దేశించి పెట్టిందనే అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు దీనిని సీరియస్ గా తీసుకున్నాడనే వార్తలు వచ్చాయి.
'సింగిల్' మూవీ విడుదలకు ముందే చెలరేగిన ఈ వివాదంతో శ్రీవిష్ణు టీమ్ దిద్దుబాటు చర్యకు దిగింది. బుధవారం రాత్రి శ్రీవిష్ణు ఈ విషయమై క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తమ అభిమతం కాదని, సరదాగా ప్రస్తుతం సమాజంలో ఉన్న కొన్ని పాపులర్ ఇష్యూస్ ను తీసుకుని కామెడీ కొన్ని సన్నివేశాలు రాసుకున్నామని, అంతేతప్పితే ఎవరినీ తక్కువ చేయడం తమ ఉద్దేశ్యం కాదని తెలిపాడు. తెలిసో తెలియకో ఎవరి మనసు అయినా నొప్పిస్తే క్షమించమని కోరాడు. సినిమారంగంలో ఉంటూ, తమ వారిని తక్కువ చేసే ఆలోచన అస్సలు తనకు ఉండదని వివరణ ఇచ్చాడు. ఆ సంభాషణలను, పదాలను సినిమా నుండి తొలగించినట్టు చెప్పాడు. మరి దీంతో ఈ వ్యవహారానికి నెటిజన్స్ ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.
ఇదిలా ఉంటే... గీతా ఆర్ట్స్ కు చెందిన నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'సింగిల్' సినిమాపై జరుగుతున్న కాంట్రవర్శినీ ఉద్దేశించే బన్నీ వాసు ఈ పోస్ట్ పెట్టి ఉంటారని అనుకుంటున్నారు.''ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది. శాంతి... శాంతి... శాంతి' అని ఆయన ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. 'సింగిల్' మూవీ ట్రైలర్ మీద వచ్చిన విమర్శలపై బన్నీ వాసుకు గట్టిగా రియాక్ట్ కావాలని ఉన్నా... పెద్దలు అల్లు అరవింద్ వంటి వారు అతన్ని వారించి, ఓపిక పట్టమని చెబుతున్నారేమోననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: Hit - The Third Case: హిట్ -3 మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి