Hit - The Third Case: హిట్ -3 మూవీ రివ్యూ
ABN , Publish Date - May 01 , 2025 | 10:08 AM
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'హిట్ -3' గురువారం జనం ముందుకు వచ్చింది. ది మోస్ట్ వయొలెంట్ మూవీ అని నాని చెబుతున్న 'హిట్ -3' ఎలా ఉందో తెలుసుకుందాం....
నేచురల్ స్టార్ నాని (Nani) టైమ్ ఇప్పుడు బాగుంది. ప్రశాంతి తిపిర్నేని (Prashanthi Tipirneni) తో కలిసి నాని ప్రొడ్యూస్ చేసిన 'కోర్ట్' (Court) మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇంతవరకూ 'హిట్' (Hit) ఫ్రాంచైజ్ లో విశ్వక్ సేన్ (Vishwaksen), అడవి శేష్ (Adivi Sesh) హీరోలుగా నటించగా, ఇప్పుడు థర్డ్ కేసును నానీ నే టేకప్ చేశాడు. డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh kolanu) 'హిట్ -3'లో నాని ని అర్జున్ సర్కార్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడు. 'హిట్ -3' మూవీకి పిల్లలను, వయసు మీద పడిన వారిని దూరంగా ఉండమని నాని రిలీజ్ కు ముందే ఎందుకు హెచ్చరించాడో తెలుసుకుందాం.
కథేంటంటే...
అర్జున్ సర్కార్ (నాని) వైజాగ్ హిట్ టీమ్ లో ఎస్.పి.. వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు వ్యక్తులు ఒకేలా రెండు హత్యలు చేస్తారు. వాటిల్లోని సారూప్యత అర్జున్ సర్కార్ ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషులను ఇలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం కలుగుతుంది. అలా దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న ఈ వ్యక్తుల మోటో ఏమిటీ? వాళ్ళు ఎందుకింత క్రూయల్ గా మనుషులను చంపుతున్నారు? అనే దానిపై తన అసిస్టెంట్స్ వర్ష (కోమలి ప్రసాద్ Komali Prasad), దివాకర్ (చైతు జొన్నలగడ్డ Chaithu Jonnalagadda) సాయంతో బాస్ నాగేశ్వరరావు (రావు రమేశ్ Rao Ramesh) కనుసన్నలలో ఈ ఆపరేషన్ ను టేకప్ చేస్తాడు. దాంతో కథ శ్రీనగర్ నుండి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్ కు సాగుతుంది. ఈ హత్యల వెనుక సి.టి.కె. ... కాప్చర్ టార్చర్ కిల్... అనే డార్క్ వెబ్ సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఆ సైకో గ్యాంగ్ ఆటలను అర్జున్ సర్కార్ ఎలా కట్టించాడు? తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి పిల్ల తెమ్మెరలా వచ్చిన మృదుల (శ్రీనిధి శెట్టి Srinidhi Setty) అతని ఆపరేషన్ కు ఎలా సహకరించింది? అనేదే 'హిట్ -3' కథ.
ఎలా ఉందంటే...
రొటీన్ కు భిన్నమైన కేసులను టేకప్ చేసి, సైలెంట్ గా వాటిని సాల్వ్ చేసే సంస్థ హిట్. తొలి రెండు సినిమాల్లో డిఫరెంట్ కేసులను అందులోని హీరోలు టేకప్ చేస్తారు. వాటితో పోల్చితే... ఇది చాలా చాలా డిఫికల్ట్ కేసు. పైగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలకు సంబంధించింది. ఇందులోని సైకో గ్యాంగ్ చేసే అరాచకాలు చూస్తే ఎవరికైనా రక్తం మరిగి పోవాల్సిందే. అసలు ఇలాంటి వారు మన మధ్య సాధారణ వ్యక్తుల్లా ఎలా తిరుగుతుంటారా? అనే సందేహమూ కలుగుతుంది. కానీ కాస్తంత లోతుగా విషయాలను అధ్యయనం చేస్తే... ఇలాంటి వాళ్ళు ప్రతిచోటా ఉన్నారనేది అర్థమౌతుంది.
సహజంగా ఏ హీరో అయినా తనకో ఇమేజ్ ఏర్పడాలని కోరుకుంటారు. అయితే దాన్ని పొంది, కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత మొనాటనీగా భావించి, ఆ ఇమేజ్ ను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. హీరో నాని ప్రస్తుతం అదే ఆలోచనతో ఉన్నారేమో అనిపిస్తోంది. ఇమేజ్ చట్రం నుండి బయటపడాలని, తనను తాను మాస్ హీరోగా, డిఫరెంట్ స్టోరీస్ చేసే కథానాయకుడిగా జనాలు గుర్తించాలనే కోరిక అతనిలో బలంగా ఉన్నట్టు అర్థమౌతోంది. 'దసరా' మూవీ నుండి అది స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా వచ్చిన 'హిట్-3' చిత్రం కూడా ఆ కోవకు చెందిందే. సినిమా ప్రారంభమే ఓ హై నోట్ తో మొదలైంది. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీతో ఇదో అందమైన ప్రేమకథ గా మారింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కంఫర్ట్ జోన్ లోకి వెళుతున్న సమయంలో కథ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. ఇక ద్వితీయార్థం మొత్తం సైకో బ్యాచ్ ను అంతమొందించడమే ప్రధానంగా సాగింది. ఆ క్రమంలో అర్జున్ సర్కార్ ఊచకోతకు అంతులేకుండా పోయింది. దాదాపు ఇరవై ఐదు నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ ను రెగ్యులర్ మూవీ గోయర్స్ ఎంత వరకూ తట్టుకుంటారనేది సందేహమే! పైగా ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న నాని నుండి ఈ స్థాయి హింసను వారు ఊహించరు కూడా! అయితే ఇప్పటికే 'దసరా' సినిమాతో నాని కొంత వరకూ తన అభిమానులను ఇలాంటి హింసాత్మక పాత్రలకు ప్రిపేర్ చేశాడు కాబట్టి... వారికీ, మాస్ ఆడియెన్స్ కూ 'హిట్ -3' కనెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి యాక్షన్ ఉన్నా... వాటికి ఓ మోటో ఉంటుంది. కానీ క్లయిమాక్స్ ఫైట్ లో దానిని హింస, అరాచకం డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది.
ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల్లో వయొలెన్స్ హద్దులు మీరి, అవసరానికి మించి ఉందన్నది స్పష్టం. అలా వచ్చిన వాటిల్లో ప్రధానంగా శైలేష్ కొలను మీద 'యానిమల్ (Animal), కిల్ (Kill), మార్కో (Marco) ' వంటి చిత్రాల ప్రభావం ఉందేమో అనే సందేహం 'హిట్ -3' చూశాక కలగక మానదు. అపరిమితమైన హింస ఉన్న ఈ చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు కాబట్టి... తమ చిత్రాన్నీ ప్రేక్షకులు హిట్ చేస్తారని 'హిట్ -3' దర్శక నిర్మాతలు భావించారేమో! కథ పరంగా వాటికీ దీనికీ ఎంతో తేడా ఉంది. అయితే... సైకో గ్యాంగ్ ను ఎదుర్కొనే క్రమంలో హీరో కూడా సైకోగా మారాల్సిన అవసరం లేదనే విషయం మేకర్స్ గుర్తిస్తే బాగుండేది.
నటీనటులు... సాంకేతిక నిపుణులు
అర్జున్ సర్కార్ పాత్రలోని డెప్త్ ను అర్థం చేసుకుని నాని చక్కని అభినయాన్ని ప్రదర్శించాడు. ఈ దేశం కోసం, ఇక్కడి పౌరులను రక్షించడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే పోలీస్ ఆఫీసర్ గా బాగా చేశాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ క్యారెక్టర్ టెంపో తగ్గకుండా చూసుకున్నాడు. అతని అసిస్టెంట్ గా కోమలి ప్రసాద్ చక్కగా చేసింది. అలానే సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతు భిన్నమైన క్యారెక్టరైజేషన్ తో మెప్పించాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి రెండు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ లో కనిపించింది. లవర్ గా... క్యూట్ గా బాగుంది. కానీ ఆ తర్వాత పోషించిన పాత్ర ఔచిత్యాన్ని దర్శకుడు సరిగా ఎలివేట్ చేయలేదు. అడవి శేష్ క్లయిమాక్స్ లో మెరుపులా ఎంట్రీ ఇచ్చాడు. ఇక మీడియాలో ప్రచారం జరిగినట్టే ఏసీపీ వీరప్పన్ గా కార్తీ (Karthi) ఎండింగ్ లో సర్ ప్రైజ్ చేశాడు. సో... 'హిట్ -4'కు అతనే హీరో అని మేకర్స్ చెప్పకనే చెప్పేశారు. అమిత్ శర్మ, శ్రీనాథ్ మాగంటి, రావు రమేశ్, సముతిర కని, సూర్య శ్రీనివాస్, బ్రహ్మాజీ తదితరులంతా బాగానే నటించారు. సాంకేతిక నిపుణుల పనితనం చెప్పుకోదగ్గది. షాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫీ, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని సీన్స్ ను ఎలివేట్ చేశాయి.
నాని మొదటి నుండి చెబుతున్నటు ముందు వచ్చిన 'హిట్' చిత్రాలు రెండూ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాగా, ఇది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. సో... ఆ జానర్ ఇష్టపడే వారు ఎంజాయ్ చేస్తారు. నాని మొదటి నుండి 'ఇది మోస్ట్ వయొలెంట్ మూవీ' అని ఎంత గట్టిగా చెప్పినా... అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే ఉన్నాయి. పైగా ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యింది. సో... ఓపెనింగ్స్ కు, వీకెండ్ కలెక్షన్స్ కు కొదవ ఉండదు. ఓవర్ ఆల్ రన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
ట్యాగ్ లైన్: అర్జున్ సర్కార్ ఊచకోత!
రేటింగ్: 2.5/5