Sarzameen: అందరి దృష్టి స్టార్ కిడ్ పైనే...

ABN , Publish Date - Jul 05 , 2025 | 10:08 AM

సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం ఇప్పుడు హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. అతని రెండో సినిమా సర్ జమీన్ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) ఇదే యేడాది 'నాదానియన్' (Nadaaniyan) చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ (Khushi Kapoor) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వీక్షకులను పెద్దంత ఆకట్టుకోలేదు. అంతేకాదు... సైఫ్ అలీఖాన్ కొడుకు కాబట్టే.. ఇబ్రహీంతో కరణ్ జోహార్ (Karan Johar) ఈ ప్రాజెక్ట్ చేశాడని, ఆశించిన స్థాయిలో ఈ సినిమా లేదని చాలామంది పెదవి విరిచారు. నెపోటిజమ్ కు వ్యతిరేకంగా గళం ఎత్తిన చాలామంది నెటిజన్స్ ఈ సినిమాను విమర్శించారు.


అయినా వెనుకడుగు వేయకుండా ఇబ్రహీం అలీఖాన్ సినిమాలు చేస్తున్నాడు. అలా జనం ముందుకు రాబోతున్న అతని రెండో సినిమా 'సర్ జమీన్'. మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దేవ్ గన్ (Kajol Devgon) జంటగా నటించిన ఈ సినిమాలో ఇబ్రహీం అలీఖాన్ వారి కొడుకుగా నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా రిలీజ్ డేట్ ట్రైలర్ ను చూసిన వారు అప్పుడూ ఇబ్రహీం నటనను చూసి పెద్దంతగా ప్రశంసించలేదు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ తో వారి అంచనాలు మారిపోయాయి. ఇందులో ఇబ్రహీం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాడని, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ సీన్స్ కూ ఆస్కారం ఉందని అర్థం చేసుకుంటున్నారు. దేశకోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ ఆఫీసర్ గా పృథ్వీరాజ్ నటిస్తుంటే, ఇటు భర్త, అటు కొడుకు మధ్య నలిగిపోయే తల్లిగా కాజోల్ యాక్ట్ చేస్తోంది. తండ్రి నిర్లక్ష్యంతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే స్పాయిల్డ్ చైల్డ్ పాత్రను ఇబ్రహీం చేశాడు. కాయోజ్ ఇరానీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ను కరణ్ జోహార్ నిర్మించాడు. ఇది కూడా 'నదానియన్' తరహాలోనే థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే వస్తోంది. ఈ నెల 25 నుండి జియో హాట్ స్టార్ లో ఈ సినిమా చూడొచ్చు.

Also Read: Tv Movies: తెలుగు టీవీల్లో.. శ‌నివారం వ‌చ్చే సినిమాలివే

Updated Date - Jul 05 , 2025 | 10:08 AM