Hari Hara Veera Mallu: పవన్ మూవీకి పాటరాసిన కీరవాణి

ABN , Publish Date - May 20 , 2025 | 12:35 PM

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమానుండి మూడవ పాట ఈ నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కీరవాణిని కలిసి అభినందించారు పవన్ కళ్యాణ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న 'హరిహర వీరమల్లు' (Harihara Veera Mallu) సినిమాకు ఆస్కార్ విజేత కీరవాణి (Keeravani) సంగీతం సమకూర్చుతున్నారు. విశేషం ఏమంటే... ఇప్పటికే పలు చిత్రాలలో పాటలు పాడిన పవన్ కళ్యాణ్‌ మొదటిసారి కీరవాణి సంగీత దర్శకత్వంలో ఈ సినిమా కోసం ఓ పాటను పాడారు. ఇప్పటికే విడుదల ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా నుండి మూడో పాటను విడుదల చేయబోతున్నారు మేకర్స్. 'సలసల మరిగే నీలోని రక్తమే' అంటూ సాగే పాటను సంగీత దర్శకులు కీరవాణి స్వరపర్చడమే కాకుండా స్వయంగా రాశారు.


hhvm1.jpeg

మంగళవారం ఉదయం ఎం. ఎం.కీరవాణి ఇంటికి పవన్ కళ్యాణ్‌ తో పాటు 'హరిహర వీరమల్లు' సమర్పకులు ఎ.ఎం. రత్నం (A.M. Ratnam), నిర్మాత ఎ. దయాకరరావు, దర్శకుడు జ్యోతికృష్ణ (Jyothi Krishna) వెళ్ళారు. అక్కడ కీరవాణి స్వయంగా ఈ పాటను వారికి వినిపించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ తన మనసులోని మాటలను ఆయనతో పంచుకున్నారు. అలానే కీరవాణితో జరిగిన ముచ్చట్లను పవన్ కళ్యాణ్‌ వివరించారు. వాటిని తెలియచేస్తూ, ''ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు (Veturi), శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) గారి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు. కీరవాణి గారి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు – నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ సాధన చేసి వదిలేయడం గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్ గారు ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి గారు. తెలుగు కథలను ప్రేమించే కీరవాణి గారు తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి గారు రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు... చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే... కానీ కీరవాణి గారు రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు. సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు'' అని అన్నారు.


hhvm.jpeg

ఈ సందర్భంగా కీరవాణిని అడిగి మరీ ఆస్కార్ ప్రతిమను చూశారు పవన్ కళ్యాణ్‌. తర్వాత కీరవాణిని సత్కరించారు. తొలిసారి పవన్ కళ్యాణ్‌ సినిమాకు వర్క్ చేస్తున్న సందర్భంగా ఈ సినిమా సంగీతానికి మరింత ప్రత్యేకత ఉండాలన్నదే తన కోరిక అని కీరవాణి తెలిపారు. 'హరిహర వీరమల్లు'లోని మూడో పాట ఈ నెల 21న విడుదల కాబోతోంది. సినిమాను జూన్ 12న ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

Also Read: War -2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 20 , 2025 | 12:37 PM