Mahavatar Narsimha: త్రీడీలో రాబోతున్న మహావతార్ నరసింహ

ABN , Publish Date - Jul 10 , 2025 | 11:22 AM

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'మహావతార్ నరసింహ'. శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోందీ సినిమా. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మహావతార్ నరసింహ' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంస్థలు ప్రతిష్టాత్మక యానిమేటెడ్ ఫ్రాంచైజీ కోసం చేతులు కలిపాయి. ఈ రెండు సంస్థలు కలిసి దశాబ్ద కాలం పాటు వరుసగా సినిమాలు చేయబోతున్నాయి. విష్ణువు దశ అవతారాలను ఈ సంస్థలు తెరపైకి ఆవిష్కరించబోతున్నాయి. అందులో మొదటిది 'మహావతార్ నరసింహ'. ఈ సినిమా ఇదే నెల 25న ఐదు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఆ తర్వాత 'మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) చిత్రాలు రాబోతున్నాయి.


తాజాగా విడుదలైన 'మహావతార్ నరసింహ' ట్రైలర్ లో ఆసక్తికరంగా సాగింది. హిరణ్య కశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్య కశిపుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఎపిక్ విజువల్స్, అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ ట్రైలర్ సాగింది. భారతీయ చరిత్ర నుండి ఈ ఐకానిక్ స్టోరీని ఇప్పటికే చాలమంది, చాలా సంవత్సరాలుగా సినిమాలుగా రూపొందించారు. అయితే ఇప్పుడు వాటికి భిన్నంగా త్రీడీ యానిమేషన్ లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.


ఈ సినిమా గురించి నిర్మాత శిల్పా ధావన్ మాట్లాడుతూ, 'శ్రీ నరసింహ, శ్రీ వరాహుల ఇతిహాస కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఫ్రేమ్, ప్రతి క్షణం, ప్రతి హార్ట్ బీట్ ఈ గొప్ప కథకు ప్రాణం పోసింది. నర్సింహ గర్జన వస్తోంది' అని అన్నారు. దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమా గురించి చెబుతూ, 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ట్రైలర్‌ను ఆయన కృపతో ఆవిష్కరించారు. డివైన్ జర్నీ ప్రారంభమైయింది. క్లీమ్ ప్రొడక్షన్స్ విజన్, ప్రేక్షకుల కోసం న్యూ ఏజ్ మీడియా, స్క్రీన్‌తో భారత్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలనే భావిస్తోంది' అని తెలిపారు.

Also Read: Tollywood: అడ్డంగా బుక్కయిన టాలీవుడ్ సెలబ్రిటీస్

Also Read: Thanikella Bharani: భరణి నాటికల ప్రదర్శన

Updated Date - Jul 10 , 2025 | 11:24 AM