Thanikella Bharani: భరణి నాటికల ప్రదర్శన
ABN , Publish Date - Jul 10 , 2025 | 10:36 AM
హైదరాబాద్ రవీంద్రభారతిలో రెండు రోజుల పాటు ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి నాటకోత్సవాలు ఘనంగా జరుగబోతున్నాయి.
ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి (Thanikella Bharani) సినిమా ల్లోకి రాకముందే నాటకరంగంలో ప్రసిద్థులు. ఆయన రాసిన పలు నాటికలు వివిధ నగరాలు, పట్టణాలలో ప్రదర్శితమై మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. భరణి రచనలోని చమత్కారానికి ముగ్థులైన ప్రముఖ నటుడు రాళ్ళపల్లి (Rallapalli) ఆయన్ని సినిమా రచన కోసం మద్రాసు తీసుకెళ్ళారు. అతి తక్కువ సమయంలో భరణి తన రచనా చాతుర్యంతో సంభాషణల రచయితగా నిలదొక్కుకున్నారు. అంతేకాదు... నటుడిగానూ తెరంగేట్రమ్ చేసి మెప్పించారు. వందలాది చిత్రాలలో నటించిన భరణి, ఆ తర్వాత 'మిధునం' (Midhunam) వంటి సినిమాను డైరెక్ట్ చేసి తన ఉత్తమాభిరుచిని చాటుకున్నారు. రచయితగా, నటుడుగా, దర్శకుడిగా భరణి తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రను వేశారు.
తనికెళ్ళ భరణి రంగస్థల జీవిత స్వర్ణోత్సవాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సంగమం ఫౌండేషన్ అధినేత సంజయ్ కిశోర్ నిర్వహించబోతున్నారు. జులై 13, 14 తేదీలలో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరుగనుంది. 13వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు 'తనికెళ్ళ భరణి నాటికలు - ప్రయోగ శీలత'పై ప్రత్యేక సదస్సు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు నాటకోత్సవాలు మొదలవుతాయి. తొలి రోజున 'జంబూ ద్వీపం', 'గోగ్రహణం','ఛల్ ఛల్ గుర్రం' నాటికలను ప్రదర్శిస్తారు. 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు 'గార్ధభాండం', కొక్కొరోకో' నాటికల ప్రదర్శన ఉంటుంది. ఇదే వేదికపై భరణి రాసిన నాటికల పుస్తకావిష్కణ చేస్తారు. 'సీనియర్ రంగస్థల కళాకారులతో పాటు భరణిని కూడా ప్రత్యేకంగా సత్కరించబోతున్నామ'ని సంజయ్ కిశోర్ తెలిపారు. రెండు రోజుల పాటు జరుగబోతున్న 'తనికెళ్ళ భరణి నాటకోత్సవాలు'కు పలువురు సినీ ప్రముఖులు హాజరవుతారని ఆయన అన్నారు.
Also Read: NTR: అనితరసాధ్యం ఎన్టీఆర్ బొబ్బిలిపులి రికార్డ్
Also Read: Tollywood: అడ్డంగా బుక్కయిన టాలీవుడ్ సెలబ్రిటీస్