Pawan Kalyan: హరిహరవీరమల్లు ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Jul 03 , 2025 | 11:16 AM
బెబ్బులి వచ్చేస్తున్నాడు... హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ రూపంలో బెబ్బులి వచ్చేస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veeramallu) ట్రైలర్ వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపికచేసిన థియేటర్లలో ఈ ట్రైలర్ ను అభిమానుల కోసం ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ మూవీ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ లో ఈ ట్రైలర్ కొత్త జోష్ ను నింపింది. ఈ చిత్ర బృందం హైదరాబాద్ విమల్ థియేటర్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్నారు.
రెండు నిమిషాల యాభై ఐదు సెకన్ల నిడివి ఉన్న ఈ సినిమాలో చిత్ర కథను చూచాయగా తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కొలువైన ఔరంగజేబు కు తెలుగు గడ్డ లో పుట్టిన హరిహర వీరమల్లు ఎలా సింహస్వప్నంగా మారాడన్నదే ప్రధానాంశం. కోహినూర్ వజ్రం చుట్టూ కూడా కథ తిరుగుతుందని తెలుస్తోంది.
విశేషం ఏమంటే... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానూ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ నిజ జీవితంలోనూ ఎదుర్కొన్న సమస్యలను ప్రతిబించేలానూ ఇందులోని సంభాషణలు ఉన్నాయి.
'ఇప్పటి దాక మేకలు తినే పులిని మీరు చూసి ఉంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తారు' అనే డైలాగ్ థియేటర్ లో విజిల్స్ వేయించేలా ఉంది. అలానే గతంలో తాను అధికారంలోకి రాకూడదని కోరుకున్న వారిని హెచ్చరిస్తూ కూడా ఓ డైలాగ్ ను ఈ ట్రైలర్ లో పెట్టారు. 'నేను రావాలని చాలామంది ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉంటారు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు' అనే సంభాషణను పెట్టారు. చివరగా 'వినాలి... వీరమల్లు చెప్పింది వినాలి' అనే సంభాషణ సైతం పవన్ కళ్యాణ్ తో బలంగా పలికించారు.
గ్రాఫిక్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఉన్నట్టుగా ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోంది. నిధి అగర్వాల్ నాయికగా నటించిన 'హరిహర వీరమల్లు'లో ఔరంగజేబు పాత్రను బాబీ డియోల్ పోషించాడు. ఈ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్ లో ఎ. దయాకర్ రావు నిర్మించారు. ఎ.ఎం. రత్నం దీనికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఈ నెల 24న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.