Telugu Cinema: సస్పెన్స్ థ్రిల్లర్ గా వైల్డ్ బ్రీత్
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:25 PM
గతంలో 'రేవు' సినిమాను ప్రొడ్యూస్ చేసిన డా. మురళీ చంద్ గింజుపల్లి ఇప్పుడు మరోసారి పర్వతనేని రాంబాబుతో కలిసి 'వైల్డ్ బ్రీత్' మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
సీనియర్ పాత్రికేయుడు పర్వతనేని రాంబాబు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'వైల్డ్ బ్రీత్' అనే పేరు పెట్టారు. ఈ సినిమాను డా. మురళీ చంద్ గింజుపల్లితో పాటు పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివాజీ రాజా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్న కుమార్, దర్శకుడు హరినాథ్ పులి పాల్గొన్నారు. పోస్టర్ ను లాంచ్ చేసిన అనంతరం శివాజీ రాజా మాట్లాడుతూ, 'కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేద'ని అన్నారు. 'రేవు' వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ నుండి ఈ సినిమా రావడం విశేషమని అన్నారు. నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, 'మన మీడియా ఫ్రెండ్స్ లో బీఏ రాజు గారు నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాంబాబు కూడా అలాగే ప్రొడ్యూసర్ గా ఎదగాలి. దర్శకుడు హరినాథ్ పులి చిన్నవాడు. అలాగే ఒదిగి ఉండి కష్టపడితే తప్పకుండా పైకి వస్తాడు. వైల్డ్ బ్రీత్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, 'మిత్రుడు రాంబాబు ప్రొడ్యూసర్ గా 'వైల్డ్ బ్రీత్' అనే ఇంట్రెస్టింగ్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్నారు. 'రేవు' అనే చిత్రాన్ని ఇప్పటికే తను చేశాడు. ఈ 'వైల్డ్ బ్రీత్' సినిమా కూడా సక్సెస్ కావాలి' అన్నారు. నిర్మాత పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ, 'ఈ రోజు నా పుట్టినరోజు. నాకు అన్ని విధాలా సహకరిస్తున్న మా నిర్మాత డా. మురళి గింజుపల్లి గారు నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు అప్పగించారు. అంతే నమ్మకంగా ఆయనకు మంచి పేరు వచ్చే సినిమాను ఇస్తాను. నెక్స్ట్ ఈవెంట్ లో ఆయన వుంటారు. నిన్న గౌరవనీయ సీ.ఎం. చంద్రబాబు గారిని కలిశాను. ఆయనకు మా 'వైల్డ్ బ్రీత్' మూవీ గురించి వివరించాను. త్వరలోనే అపాయింట్ మెంట్ ఇచ్చి పిలుస్తాను అన్నారు. 'వైల్డ్ బ్రీత్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటోంది. హరినాథ్ పులి దర్శకుడిగా ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకుంటాడు' అన్నారు. దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ, 'నాకు ఈ వైల్డ్ బ్రీత్ సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చి సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్స్ డా. మురళీ చంద్ గింజుపల్లి, పర్వతనేని రాంబాబు గారికి థ్యాంక్స్. 'వైల్డ్ బ్రీత్' ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు శివ మల్లాల, నారాయణ రాజు, హేమసుందర్, కేశవ, శక్తిమాన్, రాధాకృష్ణ, మూర్తి మల్లాల తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Also Read: Tollywood: తనను విస్మరించారంటున్న నట్టికుమార్
Also Read: Sandeep - Ram Charan: సందీప్ వంగాతో రామ్ చరణ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి