scorecardresearch

Tollywood: తనను విస్మరించారంటున్న నట్టికుమార్

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:05 PM

ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ, ఐటీ మంత్రులకు ఓపెన్ లెటర్ రాశారు. ఆదివారం జరిగే సమావేశంలో చిన్న చిత్రాల నిర్మాతల గోడు ఆలకించమని కోరారు.

Tollywood: తనను విస్మరించారంటున్న నట్టికుమార్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పది రోజుల క్రితం తెలుగు సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్య గురించి మాట్లాడాలన్నా... ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాన్ని కలవాలని చెప్పారని, కానీ దానికి భిన్నంగా ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కేవలం సినిమా పెద్దలను మాత్రమే ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) తో సమావేశం జరుపుతున్నారని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) వాపోయారు. ఆదివారం ఏపీ సీఎంను కలిసేందుకు 52 మందిని ఆహ్వానించారని, కానీ అందులో పెద్ద నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఉన్నారు తప్పితే చిన్న నిర్మాతలకు ప్రాధాన్యం దక్కలేదని అన్నారు. తాను తెలుగు సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నానని, గతంలో ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఛైర్మన్ గా సేవలు అందించానని నట్టి కుమార్ అన్నారు. అలానే తాను ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ నని తెలిపారు.

ఆదివారం తెలుగు సినిమా రంగానికి చెందిన పెద్దలు ఏపీ సీఎంను కలువబోతున్న సందర్భంగా నట్టి కుమార్ సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రి, ఐటీ మంత్రికి ఓ లేఖను రాశారు. 'చిన్న చిత్రాల నిర్మాతల సమస్యలు ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చిన్న చిత్రాల నిర్మాతలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని, పెద్ద మనసుతో చిన్న చిత్రాల నిర్మాతల సమస్యలను పరిష్కరించా'లని ఆయన లేఖలో పేర్కొన్నారు.


సినిమా థియేటర్లలో 5 షోలకు సంబంధించి, మధ్యాహ్నం 2-30 గంటల షోను తప్పనిసరిగా చిన్న చిత్రాలకు కేటాయించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉందని, అలానే 175 స్క్రీన్స్ లోపు రిలీజ్ చేసే చిన్న చిత్రాలకు 2 -30 గంటల షోను కేటాయించమని అడుగుతున్నామని నట్టి కుమార్ ఆ లేఖలో గుర్తు చేశారు.

మల్టీఫ్లెక్స్ లలో సీటింగ్ కెపాసిటీ లో 20% ఆక్యుపెన్సీ టిక్కెట్ ధరను 75/- రూపాయలుగా నిర్ణయిస్తూ జీవో ఉన్నప్పటికీ, దానిని ఎవరూ అమలు పరచడం లేదని తెలిపారు. ఇక ఆదివారం ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే మీటింగ్ కు వస్తున్న సినీ పెద్దలను 35 శాతం సినిమా షూటింగ్ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లోనే జరపాలని కోరాలని, ఎందుకంటే ఏపీ నుంచి సినిమాలకు ఆదాయం 68 శాతం పరిశ్రమకు లభిస్తే, 32 శాతం నైజాం నుంచి లభిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ, టూరిజం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, జీఎస్టీని కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కట్టే విధంగా సినీ పెద్దలకు సూచించాలని నట్టికుమార్ కోరారు. దీని కారణంగా ఎంప్లాయిమెంట్ పెరుగుతుందని అన్నారు. ఏపీకి చెందిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, అలాగే సినీపరిశ్రమ, చిన్న చిత్రాల నిర్మాతలకు మేలు జరగాలన్న సదాశయంతో తాను ఈ విజ్ఞాపన లేఖ రాస్తున్నట్టు నట్టి పేర్కొన్నారు.

Also Read: Sandeep - Ram Charan:  సందీప్ వంగాతో రామ్ చరణ్ 

Also Read: Karthika Missing Case OTT: మూడేండ్ల త‌ర్వాత.. తెలుగులో ఓటీటీకి త‌మిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 13 , 2025 | 04:10 PM