Tollywood Bandh: శుభమ్' కార్డు పడలేదా.. మళ్లీ మొదటికి టాలీవుడ్ బంద్
ABN, Publish Date - Aug 09 , 2025 | 09:34 PM
టాలీవుడ్ లో సాగుతున్న సినీ వర్కర్స్ స్ట్రైక్ కు ముగింపు లభించింది అనుకుంటూండగానే 'సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్' నిర్మాతలతో తమ చర్చలు విఫలమయినట్టు ప్రకటించడం గమనార్హం!
సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని (Anil Vallabhaneni) నిర్మాతల వైఖరిని తప్పు పట్టారు. వారి ధోరణి ఫెడరేషన్ ను విభజించేలా ఉందని అన్నారు. సినీ వర్కర్స్ లో రూ.2000 లోపు ఉన్నవారికే 25 శాతం వేతనం పెంపు చేస్తామనడం, అది కూడా ఫెడరేషన్ లోని పది సంఘాల వాళ్ళకే ఈ పెంపు వర్తిస్తుందని చెప్పడం సబబు కాదని చెప్పారు. ఫెడరేషన్ లోని 13 సంఘాల కార్మికులకూ వేతన పెంపు ఇవ్వవలసిందేనని ఆయన డిమాండ్ చేశారు. నిర్మాతల మాటల ప్రకారం డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ కు వేతన పెంపు లేదని, వారికి కూడా పెంపు వర్తింప చేయవలసిందేనని అనిల్ తేల్చి చెప్పారు. అలాగే నిర్మాతలు పెట్టిన నాలుగు షరతులనూ తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 10న) అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ వద్ద తమ నిరసన తెలియజేస్తామని ఆయన చెప్పారు. సోమవారం (ఆగస్టు 11న) ఫిలిమ్ ఛాంబర్ చర్చలకు పిలిస్తే అందులో పాల్గొంటామని ఆయన అన్నారు. ఏది ఏమైనా అనిల్ మాటలను బట్టి ఫెడరేషన్ లోని అన్ని సంఘాల వారికి వేతన పెంపు సాధించే దాకా సమ్మె సాగుతుందని తెలుస్తోంది. మరి ఈ సమ్మెకు ముగింపు ఎప్పుడు... ఆఖరి పంచ్ ఎవరిది! ఎవరు పై చేయి అనిపంచుకుంటారో తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ...