Vishwak Sen: మాస్ కా దాస్ తర్వాత...

ABN , Publish Date - May 06 , 2025 | 11:29 AM

నట, దర్శకుడు విశ్వక్ సేన్ ఇప్పటికే స్వీయ దర్శకత్వంలో రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు మరోసారి విశ్వక్ ఓ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.

మాస్ కా దాస్ (Mass ka Das) విశ్వక్ సేన్ (Vishwak Sen) లో మంచి నటుడే కాదు... దర్శకుడు కూడా. ఎనిమిదేళ్ళ క్రితం 'వెళ్ళిపోమాకే' తో హీరోగా ఎంట్రీ ఇచ్చి... ఇప్పటికీ జయాపజయాలతో కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. హీరోగా నటించిన రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది?'కి మిశ్రమ స్పందన లభించడంతో ఇక లాభం లేదని 'ఫలక్ నుమా దాస్' (Falaknuma Das) మూవీతో తానే నిర్మాతగా, దర్శకుడిగా, కథానాయకుడిగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. మలయాళ చిత్రం 'అంగమలై డైరీస్'కు రీమేక్ అయిన 'ఫలక్ నుమా దాస్' విశ్వక్ సేన్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దర్శకుడిగానూ చక్కని మార్కులే పొందాడు. ఆ తర్వాత వచ్చిన 'హిట్' (Hit) తో మరో సక్సెస్ ను అందుకున్నాడు. ఓ పక్క హీరోగా నటిస్తూనే అవకాశం దొరికినప్పుడు, తాను మాత్రమే ఆ కథకు న్యాయం చేయగలనని అనుకున్నప్పుడు మెగా ఫోన్ చేతిలోకి తీసుకుంటున్నాడు విశ్వక్ సేన్.

రెండేళ్ళ క్రితం 'మాస్ కా దాస్' మూవీలో డ్యుయల్ రోల్ చేస్తూ, దర్శకత్వ బాధ్యతలనూ తన భుజానికే ఎత్తుకున్నాడు. అయితే ఈ సినిమా 'ఫలక్ నుమా దాస్' మాదిరి విజయాన్ని మాత్రం అందుకోలేదు. విశ్వక్ సేన్ తనలోని నటుడిని ఎక్స్ ప్లోర్ చేసే క్రమంలో కమర్షియల్ పాయింట్ ను పట్టించుకోలేదు. దాంతో మూవీ ఫ్లాప్ అయ్యింది. ఈ చేదు అనుభవంతో విశ్వక్ కొంతకాలంగా డైరెక్షన్ కు దూరంగానే ఉన్నాడు. అయితే ఇప్పుడో సినిమాకోసం మళ్ళీ మెగాఫోన్ చేతిలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.


విశ్వక్ సేన్ నటించిన 'లైలా' (Laila) చిత్రం ఈ యేడాది విడుదలై పరాజయం పాలైంది. ఆ సినిమాలో ద్వంద్వార్థ సంభాషణలకు, వల్గర్ కామెడీకి మేకర్స్ పెద్ద పీట వేశారు. ఎప్పుడైతే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చి ఫ్లాప్ అయ్యిందో... విశ్వక్ మేలుకుని తన అభిమానుకులు సారీ చెప్పాడు. ఇక మీద ఇలా ఇతరులను కించపరిచే పాత్రలు చేయనని ఆచితూచి చిత్రాలను ఎంపిక చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అలా వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనుదీప్ తో ప్రస్తుతం 'ఫంకీ' (Funky) మూవీని చేస్తున్నాడు. ఇదే సమయంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, ఒకప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విశ్వక్ సేన్ తో మూవీ నిర్మించాలనుకున్నారు. నిజానికి ఈ ఆలోచన ఆయన కొడుకు సాయి కిరణ్ ది. పాలిటిక్స్ లో ప్రవేశించి, అక్కడ ఎలాంటి పట్టు దొరక్కపోవడంతో ఇప్పుడు సాయి నిర్మాతగా మారి విశ్వక్ సేన్ తో మూవీ ప్లాన్ చేశారు. 'కల్ట్' పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు విశ్వక్కే డైరెక్టర్ అని తెలుస్తోంది. మిగిలిన వివరాలను అధికారికంగా రావాల్సి ఉంది. ఏదేమైనా... 'ఫలక్ నుమా దాస్'కు సీక్వెల్ తీయాలని ఉందని గత కొంతకాలంగా చెబుతున్న విశ్వక్ సేన్... 'మాస్ కా దాస్' తర్వాత మరోసారి డైరెక్షన్ వైపు మొగ్గు చూపడంతో ఈ కథ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని అతని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: The Bhootnii: తీసినవాళ్ళకే చెమటలు పట్టించింది...

Also Read: Super Star: ఘట్టమనేని జయకృష్ణ తెరంగేట్రానికి సర్వం సిద్థం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 06 , 2025 | 12:05 PM