Super Star: ఘట్టమనేని జయకృష్ణ తెరంగేట్రానికి సర్వం సిద్థం
ABN , Publish Date - May 06 , 2025 | 09:08 AM
ఘట్టమనేని రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నాడు. 'ఆర్.ఎక్స్. 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) పెద్దకొడుకు రమేశ్ బాబు (Ramesh Babu) ఇవాళ మన మధ్య లేరు. కృష్ణ నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రమేశ్ బాబు... ఆ తర్వాత నిర్మాతగా మారిపోయారు. తన తమ్ముడు మహేశ్ బాబు (Mahesh Babu) తో సినిమాలు తీశారు. రమేశ్ బాబు మరణానంతరం ఆయన కొడుకు జయకృష్ణ (Jaya Krishna) నటనపై మక్కువ పెంచుకున్నాడు. తాతయ్య, తండ్రి, బాబాయ్ మాదిరిగా తానూ నటుడు కావాలని అనుకున్నారు. అందుకే విదేశాలలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు జయకృష్ణతో సినిమాలు నిర్మించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. అయితే... ఈ విషయంలో మాత్రం ఘట్టమనేని ఫ్యామిలీ ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఎందుకంటే నందమూరి (Nandamuri), అక్కినేని (Akkineni), రామానాయుడు (Ramanaidu) , కొణిదెల (Konidela), అల్లు (Allu) కుటుంబాల మాదిరిగానే ఘట్టమనేని వంశంలోనూ చాలామంది నటీనటులు ఉన్నారు. కృష్ణ కుమార్తె మంజులతో పాటు ఆమె భర్త సంజయ్ స్వరూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. మహేశ్ బాబు తరహాలోనే అతని చిన్న బావమరిది సుధీర్ బాబు హీరోగా కొనసాగుతున్నాడు. ఇక మహేశ్ పెద్దక్క పద్మావతి కొడుకు గల్లా అశోక్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మరో రెండేళ్ళు పోతే మహేశ్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం.
ఈ నేపథ్యంలో రమేశ్ బాబు తనయుడిని కూడా పర్ ఫెక్ట్ గా లాంచ్ చేయడానికి కృష్ణ కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి (Ajai Bhoopathi) కి సినిమా చేసే ఛాన్స్ ఇస్తున్నట్టు తెలిసింది. అజయ్ భూపతి, కార్తికేయ (Karthikeya) హీరోగా 'ఆర్.ఎక్స్. 100' (RX 100)మూవీని రూపొందించాడు. రొమాంటిక్ స్టోరీని నడిపిన పద్ధతి, కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం చాలామందికి నచ్చింది. మ్యూజికల్ గానూ హిట్ అయిన ఈ సినిమా అజయ్ భూపతికి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్ తో 'మహా సముద్రం' (Maha Samudram) మూవీని అజయ్ చేశాడు. అది ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మరోసారి పాయల్ రాజ్ పుత్ తో 'మంగళవారం' (Mangala Vaaram) అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తీశారు. ఈ సినిమా సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉండి, ఆడియెన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసింది. ఈ నేపథ్యంలో 'మంగళవారం'కు అజయ్ భూపతి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఈలోగా జయదేవ్ ను హీరోగా పరిచయం చేసే ఛాన్స్ కూడా అతనికే దక్కిందని అంటున్నారు. జయదేవ్ తొలి చిత్రాన్ని బాబాయ్ మహేశ్ బాబే దగ్గరగా ఉండి పర్యవేక్షించబోతున్నాడని తెలుస్తోంది. మొత్తం మీద కృష్ణ మనవడు, రమేశ్ బాబు కొడుకు సైతం త్వరలోనే వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
Also Read: Mega War: రీ-రిలీజ్ లో ఆసక్తికర పోరు...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి