Rowdy Janardhana: ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన
ABN, Publish Date - Dec 22 , 2025 | 08:25 PM
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొన్నేళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా.. ఆ సినిమా అంటూ ఫ్యాన్స్ కూడా విజయ్ విజయం కోసం అంతేఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rowdy Janardhana: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కొన్నేళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా.. ఆ సినిమా అంటూ ఫ్యాన్స్ కూడా విజయ్ విజయం కోసం అంతేఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, వచ్చిన ప్రతి సినిమా పరాజయాన్ని చవిచూస్తూనే వస్తుంది. కానీ, పట్టువదలని విక్రమార్కుడులా విజయ్ విజయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రాల్లో VD 15 ఒకటి. రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకొని సెట్స్ మీదకు వెళ్ళింది.
ఇక VD15 కి ఎప్పటి నుంచో రౌడీ జనార్ధన అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఆ టైటిల్ నే ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మునుపెన్నడూ చూడని విజయ్ ని రౌడీ జనార్ధనలో చూపించాడు రవికిరణ్ కోలా. ' బండెడు అన్నం తిని.. కుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా.. ?నేను చూసాను. కొమ్ములతో ఆడి కథను ఆడే రాసుకున్నోడు.. కన్నీళ్లను ఒంటికి నెత్తురలా పూసుకున్నోడు.. చావు కళ్ల ముందు వచ్చి నిలబడితే.. కత్తై లేసి కలబడినోడు.. కనపడ్డాడు నాలోపల ' అంటూ విజయ్ బేస్ వాయిస్ తో చెప్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం.
ఇక ఒక్కసారిగా ఒంటినిండా రక్తంతో చుట్టూ ఉన్న వందలమంది మనుషులను తన మాటతో.. చేతిలో కత్తితో బెదరకొట్టిన రౌడీ జనార్దన అదిరిపోయాడు. ముఖ్యంగా విజయ్ నోటి నుంచి అలాంటి బూతు పదం వస్తుంది అని ఎవరు అనుకోలేదు. కానీ, ఆ అగ్రెసివ్ మోడ్ లో ఆ పదం విజయ్ అంటుంటే.. ప్రతి ఒక్కరు అలా చూస్తూ ఉండిపోయారు. ముఖ్యంగా విజయ్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. టోటల్ గా గ్లింప్స్ తోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. విజయ్ ఈసారి చాలా కామ్ గా కనిపిస్తున్నాడు. అతనిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తుఫాన్ వచ్చేముందు వాతవరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. విజయ్ అలానే కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా విజయ్ విజయానికి దగ్గరగా వేళ్తాడో లేదో చూడాలి.