Tollywood: నిర్మాతగా వెంకీ కుడుముల... హీరోగా నిర్మాత మహేశ్ రెడ్డి తనయుడు
ABN , Publish Date - Dec 14 , 2025 | 02:02 PM
దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారి 'ఇట్లు అర్జున' పేరుతో ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ పారిశ్రామిక వేత్త మహేశ్ రెడ్డి రెండో కొడుకు అనీశ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
తెలుగు సినిమా రంగంలో దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. అలానే యువ దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula) సైతం ఇప్పుడు నిర్మాత అయ్యారు. 'ఛలో, 'భీష్మ', 'రాబిన్ హుడ్' చిత్రాలున వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు. మొదటి రెండు సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. కానీ 'రాబిన్ హుడ్' పరాజయం పాలైంది. దాంతో ఇప్పుడు ఆయన నిర్మాతగా టర్న్ తీసుకున్నారు. 'వాట్ నెక్స్ట్ ఎంటర్ టైన్ మెంట్స్' బ్యానర్ లో మహేశ్ ఉప్పల (Mahesh Uppala) ను దర్శకుడి పరిచయం చేస్తూ వెంకీ కుడుమల ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిజానికి ఇది కాదు వార్త... ఈ సినిమా ద్వారా అతను హీరోగా ఎవరిని పరిచయం చేస్తున్నాడన్నదే అసలైన వార్త. వెంకీ కుడుమల నిర్మిస్తున్న సినిమాకు 'ఇట్లు అర్జున' అనే పేరు పెట్టారు. ఇందులో అర్జున పాత్రతో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎ.ఎం.ఆర్. ఇండియా చైర్మన్ మహేశ్ రెడ్డి (Mahesh Reddy) తనయుడు అనీశ్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
పారిశ్రామిక వేత్తగానే కాదు ధార్మిక రంగంలోనూ దాతగా గొప్ప పేరు తెచ్చుకున్నారు మహేశ్ రెడ్డి. అంతేకాదు... తన అభిరుచికి తగ్గట్టుగా తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలను నిర్మించారు. నాగార్జున హీరోగా మహేశ్ రెడ్డి 'శిరిడి సాయి' మూవీని ప్రొడ్యూస్ చేశారు. అలానే ఆ తర్వాత కొంత కాలానికి 'ఓం నమో వెంకటేశ' మూవీనీ నిర్మించారు. ఈ రెండు సినిమాలకు కె. రాఘవేంద్రరావు దర్శకులుగా వ్యవహరించారు. అయితే ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు తన కొడుకును పరిచయం చేసే బాధ్యతలను వెంకీ కుడుమలకు అప్పటించినట్టు తెలుస్తోంది. వెంకీ సైతం దర్శకుడి 'రాబిన్ హుడ్' మూవీ నిరుత్సాహానికి గురిచేయడంతో 'ఇట్లు అర్జున' దర్శకత్వ బాధ్యతలను మహేశ్ కు అప్పగించినట్టు అనిపిస్తోంది.
'ఇట్లు అర్జున' మూవీలో హీరోయిన్ గా మలయాళ నటి అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 25న విడుదల కాబోతున్న 'ఛాంపియన్' సినిమాతో అనస్వర రాజన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు థమన్ (S Thaman) సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కు నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చారు. విశేషం ఏమంటే మొన్న వచ్చిన 'మోగ్లీ' సినిమాలో హీరోయిన్ మూగది. ఇప్పుడీ సినిమాలో హీరో మూగవాడు. మొత్తానికీ విజువల్ ఛాలెంజ్డ్ పర్సన్ ను ప్రధాన పాత్రధారులుగా సినిమాలు చూపించే ట్రెండ్ మళ్ళీ మొదలైందని అనుకోవాలి.