Adarsa Kutumbam: వెంకీ, త్రివిక్రమ్.. 'ఆదర్శ కుటుంబం' AK47
ABN, Publish Date - Dec 10 , 2025 | 10:18 AM
వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమా షూటింగ్ ఇవాళ మొదలైంది. దీనికి 'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్ ఖరారు చేశారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 సమ్మర్ కు రిలీజ్ చేయబోతున్నారు.
ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కొత్త సినిమా షూటింగ్ మొదలైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకుడిగా హారిక అండ్ హాసిని పతాకంపై దీనిని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. గతంలో ఇదే సంస్థకు చెందిన సిస్టర్ కన్సర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్ లో వెంకటేశ్ 'బాబు బంగారం' (Babu Bangaram) మూవీలో నటించారు. దానికి మారుతీ దర్శకత్వం వహించారు.
చాలా కాలం క్రితమే వెంకటేశ్ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త వచ్చింది. ఇంతవరకూ వెంకటేశ్ నటించిన సినిమాలకు కథ, మాటలను మాత్రమే అందించిన స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తారనే విషయమూ ప్రకటించారు. కానీ రకరకాల కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం మాత్రం వెంకటేశ్ తోనే త్రివిక్రమ్ మూవీ చేయబోతున్నాడనే వార్తను ధృవీకరించారు.
తాజాగా వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూవీ షూటింగ్ ను డిసెంబర్ 10న గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలు పెట్టారు. దీనికి 'ఆదర్శ కుటుంబం' అనే పేరు ఖరారు చేసినట్టు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ తెలిపారు. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా 'హౌస్ నెం. 47, ఎ.కె. 47' అని పెట్టారు. ఈ ట్యాగ్ లైన్ సినిమా మీద క్యూరియాసిటీని పెంచేలా ఉంది. సినిమాలో యాక్షన్ పార్ట్ కూ ప్రాధాన్యం ఉందని లోగో ను పరిశీలిస్తే అర్థమౌతోంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళే వెంకటేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నూ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని 2026 సమ్మర్ కు రిలీజ్ చేయబోతున్నారు. సో... వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలోనే వెంకటేశ్ నటించిన రెండు సినిమాలు వస్తాయని అనుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలో వెంకటేశ్ కీలక పాత్రను పోషించాడు. అలానే సమ్మర్ కు 'ఆదర్శ కుటుంబం' రాబోతోంది. మరి యేడాది పూర్తయ్యేలోగా వెంకటేశ్ మరో సినిమాను రిలీజ్ చేయగలిగితే... ఏకంగా ఆయన నటించని మూడు సినిమాలు 2026లో విడుదలైనట్టు అవుతుంది.