Pelli Chesukundam: వెంకటేశ్..'పెళ్ళి చేసుకుందాం'.. రీ-రిలీజ్
ABN, Publish Date - Nov 28 , 2025 | 01:53 PM
విక్టరీ వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13న 'పెళ్ళి చేసుకుందాం' సినిమా రీ-రిలీజ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను సాయిలక్ష్మీ ఫిలిమ్స్ అధినేత వరప్రసాద్ విడుదల చేస్తున్నారు.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కెరీర్ లో చెప్పుకోదగ్గ గొప్ప చిత్రాలలో 'పెళ్ళి చేసుకుందాం' (Pelli Chesukundam) కూడా ఒకటి. సి. వెంకట్రాజు, శివరాజు నిర్మించిన ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య (Mutyala Subbaiah) తెరకెక్కించారు. హిట్ జోడీ వెంకటేశ్, సౌందర్య (Soundarya) జంటగా నటించిన ఈ సినిమాలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (SP Bala surbrahmanyam) కీలక పాత్రను పోషించారు. పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali) సంభాషణలు సమకూర్చడంతో పాటు ఇందులో ఓ ప్రధాన పాత్రను పోషించారు. కోటి (Koti) సంగీతం అందించిన ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ గానూ నిలిచింది.
'పెళ్ళి చేసుకుందాం' సినిమాను వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13, శనివారం రీ-రిలీజ్ చేయబోతున్నామని సాయిలక్ష్మీ ఫిలిమ్స్ అధినేత వరప్రసాద్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 4 కె లో ఈ సినిమాను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. మూడేళ్ళ పాటు ఈ సినిమా హక్కుల్ని తామే పొందామని, వెంకటేశ్ అభిమానులతో పాటు రెగ్యులర్ సినిమా అభిమానులూ మరోసారి 'పెళ్ళి చేసుకుందాం' సినిమాను థియేటర్లలో చూసి ఆనందిస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఏకంగా 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, వెంకటేశ్ పట్ల ప్రేక్షకులలో ఉన్న అభిమానాన్ని నిరూపించిందని, ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్స్ గా నిలిచిన ఈ సినిమానూ వారు మరోసారి చూస్తారనే ఆశాభావాన్ని వర ప్రసాద్ వ్యక్తం చేశారు. 'పెళ్ళి చేసుకుందాం' సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను లైలా, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి తదితరులు పోషించారు.
Also Read: Prithviraj Sukumaran: ఓర్వలేక ఇంత నీచానికి దిగజారుతున్నారు..