VC Sajjanar - Rajinikanth: మీరు ‘రియల్ సూపర్ స్టార్’ రజిని గారు
ABN, Publish Date - Aug 18 , 2025 | 12:01 PM
రజనీకాంత్‌ను ఉద్దేశించి తెలంగాణా ఆర్‌టీసీ ఎం.డి వి.సి సజ్జనార్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. మీరు ‘రియల్ సూపర్ స్టార్’ రజనీ గారు’ అంటూ ట్వీట్ చేశారు.
తలైవా రజనీకాంత్ (Rajinikanth) స్టైల్, యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. సింపుల్‌సిటీకి కేరాఫ్ అడ్రస్ ఆయన. అదే ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకోవడానికి కారణం. తాజాగా ఆయన్ను ఉద్దేశించి తెలంగాణా ఆర్‌టీసీ ఎం.డి వి.సి సజ్జనార్ (V.C. Sajjanar) సుదీర్ఘ పోస్ట్ చేశారు. మీరు ‘రియల్ సూపర్ స్టార్’ రజనీ గారు’ (Real Superstar Rajini) అంటూ ట్వీట్ చేశారు.
ఆయన ఏమన్నారంటే.. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెల్రబెటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా వెనుకాడటం లేదు. కాసులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు. ఎంతో మంది జీవితాలను చేజేతులా నాశనం చేస్తున్నారు. కానీ, 50 ఏళ్ల మీ సినీ జీవితంలో మీరు ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయం. మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయొద్దనే ఉద్దేశంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. మాకు డబ్బే ముఖ్యం, సమాజం ఎటు పోయిన మాకేంటి అనుకునే ప్రస్తుత సెలబ్రిటీలు రజనీ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. బెట్టింగ్ యాప్స్, మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలతోపాటు సమాజాన్ని చిద్రం చేసే సంస్థలు ప్రమోషన్లకు దూరంగా ఉండాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. రజనీ సినీ కెరీర్‌కు 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో స్నేహితులు, రాజకీయ నాయకులు తలైవాకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ తరుణంలో సజ్జనర్ కూడా రజనీని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. ప్రకటనలా వద్దే వద్దు అంటూ గతంలో రజనీ చెప్పిన మాటల్ని ఆయన జోడించారు.
రెండుసార్లే.. అది కూడా ఫ్రీ..
దేశంలో ప్రకటనల్లో నటించని ఏకైక స్టార్ రజనీకాంత్. కోట్లు ఆఫర్ చేసినా ‘నేను ఏ యాడ్ చేసినా నా అభిమానులు గుడ్డిగా నమ్మేస్తారు. వాటిలోని లోటుపాట్లకి నేను బాధ్యుడిని అవుతా. కాబట్టి ఆ సంపాదన నాకొద్దు’ అని రజనీ అంటారు. వీడియోల్లో నటించక్కర్లేదు.. కనీసం మీ ముఖాన్ని అయినా వాడుకోనివ్వండి అన్నా సరే.. ససేమిరా ‘నో’ అంటారు సూపర్‌స్టార్. ఆయన కెరీర్‌లో రెండుసార్లే ప్రకటనల్లో నటించారు. తమిళనాడు ప్రభుత్వం 1980ల్లో ప్రారంభించిన పల్స్ పోలియో చుక్కల మందు వ్యాప్తికి పైసా తీసుకోకుండా నటించారు. ఆయన ప్రకటనతో ఈ కార్యక్రమం మారుమూల గ్రామాల్లోకి కూడా చొచ్చుకుపోయింది. అప్పటి నుంచి జనమంతా ‘రజనీ పోలియో చుక్కలు’ అనడం మొదలు పెట్టారు. ఆ తర్వాత నేత్రదానం గురించి మరోసారి యాడ్ చేశారు. అది కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా!