Pawan Kalyan: పవన్ కోసం మరో కథ.. ఇవన్నీ వర్కవుట్ అవుతాయా..
ABN, Publish Date - Oct 28 , 2025 | 01:10 PM
పవన్ కల్యాణ్ అవకాశం ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడతారు. ఇప్పటికే ఆయనతో సినిమా చేయడం కోసం ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అవకాశం ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడతారు. ఇప్పటికే ఆయనతో సినిమా చేయడం కోసం ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ‘ఓజీ’ (OG) చిత్రంతో హిట్ అందుకున్నారు పవన్. ఆయన్ను అభిమానులు ఎలా (vamsy paidipally) చూడాలనుకుంటున్నారో అలా చూపించారు దర్శకుడు సుజీత్. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిందీ చిత్రం. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రీకరణ దశలో ఉంది. తరవాత పవన్ సినిమా ఏంటన్నది ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఓ పక్క ఓజీకి కొనసాగింపు ఉందని హీరో, దర్శకుడు ప్రకటించారు. ఇది కాకుండా మరో సినిమా కూడా ఉందని టాక్ నడుస్తోంది. సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. సురేందర్ రెడ్డి కథ రెడీ చేశారు కూడా! ముందు అనుకున్న లెక్కల ప్రకారం ఈ చిత్రమే పట్టాలెక్కాలి. ఆ సన్నాహాలూ నడుస్తున్నాయని టాక్. దర్శకుడు సముద్రఖని కూడా పవన్ కోసం ఓ కథ సిద్థం చేశారని అప్పట్లో వార్త వైరల్ అయింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్రో’ సినిమా వచ్చింది. త్రివిక్రమ్ ఈ కాంబోని సెట్ చేేస పనిలో ఉన్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా మరో పేరు వినిపిస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పవన్‌తో సినిమా చేసే రేసులో ఉన్నారని తెలిసింది. విజయ్‌తో ‘వారసుడు’ తీసిన తర్వాత వంశీ ఎక్కడా తదుపరి చిత్రాల గురించి మాట్లాడలేదు. హిందీలో అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కథలు చెప్పారు. అవి వర్కవుట్ కాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం అందింది. ఈ కథని దిల్ రాజు స్వయంగా పవన్ చెంతకు తీసుకెళ్లారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్‌తో ‘వకీల్ సాబ్’ తీశారు దిల్ రాజు. పవన్‌తో ఆయనకున్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. దిల్ రాజు కూడా కల్యాణ్‌తో మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ ఈక్వేషన్‌తో ఆయనతో సినిమా చేయడం పక్కా అని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దిల్ రాజు స్కూల్ నుంచి వచ్చినవాడే కాబట్టి ఈ సినిమాను ఆయనే నిర్మించే అవకాశం ఉంది. ఈ క్యూలో పవన్ మొదట ఏ సినిమా మొదలుపెడతారో చూడాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక్కడ సినిమాల క్యూ పెద్దగా ఉంది. ఇవన్నీ వర్కవుట్ అవుతాయా అన్నది చూడాలి.