Vaishnavi Chaitanya: తడబడుతున్న కెరీర్...

ABN, Publish Date - May 02 , 2025 | 03:43 PM

వైష్ణవి చైతన్య కెరీర్ ఇప్పుడు బాలెన్స్ తప్పుతోంది. ఒక విజయం... రెండు పరాజయాలతో సాగుతోంది. 'బేబీ' విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే 'లవ్ మీ', 'జాక్' పరాజయాలు ఆమె కెరీర్ ను నీరుకార్చుతున్నాయి.

అదృష్టం ఒకసారి తలుపు తడితే... దురదృష్టం తెరిచే వరకూ కొడుతుందని పెద్దలు చెబుతుంటారు. తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య విషయంలో అది నిజమేననిపిస్తోంది. ఒక్కసారిగా 'బేబీ' మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చిన వైష్ణవి చైతన్య కెరీర్ ఇప్పుడు అగమ్యగోచరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ నుండి వెండితెరపైకి అడుగుపెట్టిన వైష్ణవి చైతన్య తొలి రోజుల్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైంది. చెల్లెలి పాత్రలతో అలా ఇలా కనిపించి... ఒక్కసారిగా 'బేబీ'తో ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్ కేటగిరిలోకి చేరిపోయింది. ఒక్క అవకాశం... ఒకే ఒక్క అవకాశం... అంటూ ఎదురుచూసే వందలాది మంది అమ్మాయిలలో ఎవరికో గానీ దక్కని ఛాన్స్ వైష్ణవికి 'బేబీ'తో దక్కింది. తొలుత ఆ సినిమా చేయడానికి అమ్మడు కాస్తంత ఆలోచించినా... చివరకు పాత్రను ఓన్ చేసుకుని బాగా పండింది. నటిగా మంచి మార్కులు పడటమే కాదు... వైష్ణవికి పలు అవకాశాలను తెచ్చిపెట్టింది 'బేబీ' చిత్రం.

అయితే... 'బేబీ'తో ఒకసారి వైష్ణవి చైతన్య తలుపు తట్టింది అదృష్టదేవత. కానీ ఇప్పుడు దురదృష్టదేవత మాత్రం ఆమెను ఓ పట్టాన వదిలిపెట్టేలా లేదు. 'బేబీ' తర్వాత ఏకంగా దిల్ రాజు బ్యానర్ లో ఛాన్స్ దక్కించుకుంది వైష్ణవి. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్‌ సరసన 'లవ్ మీ'లో నటించింది. బట్.. ఆ సినిమా ఊహించని విధంగా దారుణంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లో చేస్తున్న 'జాక్'తో ఆ లోటును అధిగమించగలనని వైష్ణవి భావించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'జాక్' కూడా పరాజయం పాలు కావడంతో అమ్మడికి ఇప్పుడేమీ పాలు పోవడం లేదు. నిజానికి 'లవ్ మీ'తో పోల్చితే... 'జాక్'లో ఆమెది అస్సలు ప్రాధాన్యం ఉన్న పాత్రే కాదు. కానీ సినిమా సక్సెస్ అయితే చాలు అని వైష్ణవి భావించినా... అది కూడా జరగలేదు.


ఇదిలా ఉంటే... వైష్ణవి ఇప్పుడు మరోసారి ఆనంద్ దేవరకొండ సరసన ఓ సినిమాలో చేస్తోంది. 'నైన్టీస్' వెబ్ సీరిస్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తనను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని 'బేబీ' భామ భావిస్తోంది. అయితే... 'బేబీ' హిట్ అయిన తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవితోనే ఓ కొత్త దర్శకుడితో సినిమా తీస్తున్నట్టు ఎస్.కె.ఎన్., సాయి రాజేశ్‌ ప్రకటించారు. కానీ ఆ తర్వాత వైష్ణవితో వచ్చిన మనస్పర్థల కారణంగా ఆ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో వైష్ణవి కూడా కొత్త అవకాశాల కోసం అర్రులు చాచకుండా ఆచితూచి అడుగులు వేయాలని అనుకుంటోందట. మరో గ్రాండ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వైష్ణవి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!?

Also Read: Ramayana teaser: వేవ్స్ సమ్మిట్ లో రామనామం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 02 , 2025 | 03:43 PM