Ustaad Bhagat Singh: ఉస్తాద్ ను పరుగులు పెట్టిస్తున్న పవర్ స్టార్...
ABN , Publish Date - Jul 29 , 2025 | 09:52 AM
పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో 'గబ్బర్ సింగ్' తర్వాత వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ క్లయిమాక్స్ చిత్రీకరణ పూర్తయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కమిట్ అయిన సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా ఈ నెల 24న విడుదలై థియేటర్లలో సందడి చేస్తుండగానే... ఆయన 'ఓజీ' (OG) సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. తాజాగా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమా క్లయిమాక్స్ నూ కంప్లీట్ చేశారు.
భావోద్వేగాలు, యాక్షన్ తో కూడిన ఈ క్లయిమాక్స్ ను దర్శకుడు హరీశ్ శంకర్ అద్భుతంగా తెరకెక్కించాడని నిర్మాతలు, మైత్రీ మూవీస్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ చెబుతున్నారు. ఈ క్లయిమాక్స్ కు నబకాంత కొరియోగ్రఫీ అందించారు. ఈ సీక్వెన్స్ అద్భుతంగా రావడంత పవన్ కళ్యాణ్ సైతం హర్షం వ్యక్తం చేశారు. షూటింగ్ పూర్తి అయిన తర్వాత నబకాంత టీమ్ లోని అందరికీ ఆయన ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారని చిత్రబృందం తెలిపింది. 'గబ్బర్ సింగ్' లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో శ్రీలీల (Sreeleela), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పార్థిబన్, కె. ఎస్. రవికుమార్, రాంకీ, నవాబ్ షా, 'కేజీఎఫ్' ఫేమ్ అవినాష్, నాగ మహేష్, 'టెంపర్' వంశీ తదితరులు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అత్యున్నత సాంకేతిక బృందం పనిచేస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యువ ప్రతిభావంతుడు ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం, నబకాంత మాస్టర్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అయనంక బోస్, కాస్ట్యూమ్ డిజైనర్ గా నీతా లుల్లా, కళా దర్శకుడిగా ఆనంద్ సాయి వ్యవహరిస్తున్నారు.
Also Read: Avatar 3: కామెరూన్ మామ.. ఏం డిసైడ్ చేసినవ్ పో...
Also Read: Tuesday Tv Movies: మంగళవారం, జూలై 29.. తెలుగు టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే