Avatar 3: కామెరూన్ మామ.. ఏం డిసైడ్ చేసినవ్ పో
ABN , Publish Date - Jul 29 , 2025 | 08:17 AM
కామెరూన్ భారీ విజువల్ వండర్ అవతార్ 3 ట్రైలర్ తాజాగా విడుదలై సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
హాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కిస్తున్న భారీ విజువల్ వండర్ అవతార్ 3 (Avatar 3) ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో మెస్మరైజ్ చేసిన ఈ సినిమాల సిరీస్‌లో ఇప్పుడు మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరిస్తుండగా తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. దీంతో అనేక మంది తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ట్వీట్లు రీట్వీట్లు చేస్తూ అవతార్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు.
మొదటి భాగంలో.. పండోరా గ్రహం అడవుల్లో నివసించే జాతి, రెండో భాగంలో నీటిలో ఉండే వారి అధారంగా సినిమాలు తెరకెక్కగా ఇప్పుడు ముచ్చటగా మూడోది ఫైర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ ట్రైలర్‌లో కొత్త అగ్ని నెవీ తెగలు, పాండోరా మళ్ళీ ఎదుర్కొంటున్న మానవ ముప్పు, కొత్త ఎమోషనల్ కోణాలు అద్భుతంగా చూపించారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని, ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా విజువల్ వండర్‌గా తీర్చదిద్దారని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హై ఇచ్చేలా ఉందని విజువల్స్ నభూతో అనేలా ఉండి గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయని పదే పదే అంటున్నారు. ఫైర్ నేషన్ (Fire Nation) లీడర్‌గా కొత్త విలన్ ఇంట్రడక్షన్ స్టన్నింగ్‌గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ముఖ్యంగా మొదటి రెండు భాగాలను మించి హై విజువల్స్, ఎమోషన్స్‌తో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది, ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపించేలా ఉందని, ఆగలేక పోతున్నామంటూ చాలామంది పోస్టులు పెడుతున్నారు. మరి కొంతమంది అసలు వాళ్లు క్రియేట్ చేసిన వాళ్లని, గ్రాఫిక్స్ అంటే నమ్మలేకుండా ఉందని, రియల్ వాళ్లతోనే సినిమా తీసినట్లుగా ఉందని పేర్కొంటున్నారు.
ఇప్పట్లో ఇలాంటి విజువల్స్‌ను కొట్టే సినిమా రాదని వస్తే మళ్లీ అది అవతార్ 4 మాత్రమే అయితుందని కితాబిస్తున్నారు. ఇలాంటివి చూస్తే సరిపోదని అనుభూతి చెందాల్సిందేనని తెలుపుతున్నారు. పార్ట్ 3తో మరో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారని చెబుతున్నారు.
అసలు కమరూన్ మామ నువ్వేం తింటున్నావ్.. ఈ విషయాలో ఇలా ఎలా చేస్తున్నావయ్యా, ఆ గ్రాఫిక్స్ ఏంటి సామి నీకో దండం అంటూ ఇక్కడి యూత్ తెగ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్రాఫిక్స్అంటే కామరూన్ తర్వాతే ఎవరైనా అని ఆకాశానికేత్తేస్తున్నారు. కాగా డిసెంబర్ 19న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుండగా సుమారు 160 పైకి భాషల్లో అనువాదం అయి రిలీజ్ కానుంది. అవతార్ 3 అనంతరం 2029లో ‘అవతార్ 4’, చివరి ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు.