Ustaad Bhagat Singh: ఉస్తాద్ నిర్మాతతో ఫెడరేషన్ వాగ్వాదం.. రిహార్సల్ ఆగిపోయింది
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:53 PM
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్‌లో అడుగుపెట్టనున్నారు. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేసిన సెట్ ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది
ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్‌లో (Ustaad Bhagat Singh) అడుగుపెట్టనున్నారు. అన్నపూర్ణ ఏడెకరాల (Annapurna studios) స్టూడియోలో వేసిన సెట్ ఈ చిత్రం షూటింగ్ సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. పవన్‌కల్యాణ్ షూటింగ్‌లో అడుగుపెట్టడానికి సిద్దమయ్యారు. ముంబై డాన్సర్స్‌తో రిహార్సెల్ ఈరోజు షెడ్యూల్‌లో ఉంది. దీంతో అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ వద్ద పోలీసు బందోబస్తు బలంగా ఉంది. పవన్ స్టూడియోలో ఉన్నారని తెలుసుక్ను ఫెడరేషన్ సభ్యులు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో నిర్మాత చెర్రితో ఫెడరేషన్ ఎంప్ల్లాయిస్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రీకరణ ఆగిపోయింది. (Film Fedaration Employees)
మరోపక్క ఫెడరేషన్ ఆఫీస్‌ను సినీ కార్మికులు ముట్టడించారు. రోజువారి వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేడు ఫిలించాంబర్‌లో నిర్మాతల మండలి సమావేశమై ఫెడరేషన్ డిమాండ్స్ పై చర్చించనున్నారు. అయితే ఫెడరేషన్ సభ్యులు 30 శాతం వేతనాల పెంపు విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
అసలేం జరిగిందంటే.. ముప్పై శాతం వేతనాలు పెంచితే కానీ షూటింగ్స్‌లో సినిమా కార్మికులు పాల్గొనరని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆదివారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోగా... ఈ నిర్ణయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తప్పు పట్టింది. ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పేరుతో ఓ లేఖను మీడియాలో హల్‌చల్ చేసింది. అందులో నిర్మాతలను ఉద్దేశించి రాస్తూ, ‘ఫెడరేషన్ పక్షపాతంగా 30 శాతం వేతనాల పెంపునకు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలకు భారీ నష్టం జరుగుతుంది. సమస్య పరిష్కారం కోసం ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు స్వతంత్ర చర్యలు లేదా సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకూడదు.ఛాంబర్ ఇచ్చే మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలి. శాశ్వత పరిష్కారం కోసం మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి’ అని అందులో పేర్కొంది.