Body Doubles: హీరోస్ బాడీ డబుల్స్ తో ట్రబుల్స్!
ABN, Publish Date - Jun 04 , 2025 | 08:02 PM
టాప్ స్టార్స్ సినిమాల్లో రూపొందే రిస్కీ షాట్స్ లోనూ, భారీ ఫైటింగ్ సీన్స్ లోనూ 'డూప్స్' (Dupes)ను ఉపయోగించడమన్నది సినిమా తొలి రోజుల నుంచీ సాగుతోంది.
టాప్ స్టార్స్ సినిమాల్లో రూపొందే రిస్కీ షాట్స్ లోనూ, భారీ ఫైటింగ్ సీన్స్ లోనూ 'డూప్స్' (Dupes)ను ఉపయోగించడమన్నది సినిమా తొలి రోజుల నుంచీ సాగుతోంది. ఈ 'డూప్స్'నే 'బాడీ డబుల్స్' (Body doubles)అనీ అంటూ ఉంటారు. పాత రోజుల్లో హీరో ఎగిరి గాల్లో గింగిరాలు కొడుతూ విలన్స్ ను చావబాదే సీన్స్ వంటివి ఉంటే ఈ డూప్స్ ఆ ఫీట్స్ చేసేవారు. అది అందరికీ తెలిసిందే.
టెక్నాలజీ పెరిగిన తరువాత గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఫార్మాట్స్ వచ్చాక అసలైన హీరోలే గాల్లో తేలుతూ ప్రత్యర్థులను బాదేలా చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ మధ్య ఓ టాప్ స్టార్ మాత్రం తన చిత్రాల్లో ఎక్కువగా బాడీ డబుల్ ను ఉపయోగించుకుంటూ అసలైన సీన్స్ లో మాత్రమే తాను కనిపిస్తున్నాడని టాక్! ఫైట్స్ లో బాడీ డబుల్ ను ఉపయోగించుకోవచ్చు. కానీ, ఈ హీరోగారు మామూలు సన్నివేశాల్లోనూ తన డూప్స్ తో లాగించండి అంటూ మేకర్స్ కే సలహా ఇస్తున్నాడట! సదరు హీరో రెండు మూడు సినిమాల్లో నటిస్తూ ఉండడం వల్ల ఎక్కువమంది డూప్స్ కావలసి వస్తోంది. దాంతో ఆయన ఏర్పరచిన ఓ టీమ్ (Selection Team for choosing Body Doubles) హీరో పర్సనాలిటీకి తగ్గ బాడీ డబుల్స్ ను ఎంపిక చేస్తున్నారట! అంతేకాదు, ఆ ఎన్నికైన బాడీ డబుల్స్ హీరోలాగే నటిస్తున్నారో లేదో కూడా చెక్ చేయడం ఆ టీమ్ ప్రథమ లక్ష్యం! ఒకవేళ బాడీ డబుల్ గా ఎన్నికైన వారు తృప్తికరంగా నటించకపోతే, మరో డూప్ ను ఎంపిక చేసే పని సదరు బృందానిదే!
ఆ హీరో కాంబోలో నటించేవారు కొందరు 'డూప్'తో నటించడం వల్ల తమ ఎక్స్ ప్రెషన్స్ కూడా పండడం లేదని వాపోతున్నారట! మరి ఈ బాడీ డబుల్స్ ఎంపిక వల్ల నిర్మాతలు, దర్శకులు ఎలా ఫీలవుతున్నారో? ఈ ప్రశ్నకు మాత్రం వారు సైతం రాజీపడుతున్నారనే తెలుస్తోంది.
పేరున్న టాప్ స్టార్ కాల్ షీట్స్ ఇవ్వడమే అదృష్టంగా భావించే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అతని తీరుకు ఎదురుచెప్పే ధైర్యం ఉందంటారా!? ఏది ఏమైనా ఇదే తీరు కొనసాగితే మిగతా హీరోలు సైతం తాము ఎక్కడో ఉంటూ తమ డూప్స్ తో సినిమాల షూటింగ్ జరిపే ప్రమాదం ఉంది. అదే జరిగితే, రాబోయే 'ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్' (AI Days) రోజుల్లో మరిన్ని కృత్రిమ పరిణామాలు తలెత్తవచ్చు. తద్వారా భావి నటీనటులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందనీ సినీపండిట్స్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ సీరియస్ గా తీసుకోవలసిందే!