Peddi: పాటపై కాపీ ఆరోపణలు! వ్యూస్ మాత్రం అంతకుమించి
ABN, Publish Date - Nov 11 , 2025 | 09:53 PM
ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన చికిరి చికిరి పాటపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి.
రామ్‌చరణ్ (Ram Charan), బుచ్చిబాబు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాంబోలో వస్తున్న ‘పెద్ది (Peddi)’ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణాల్లో జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి (Chikiri Chikiri)’ పాట దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇన్‌స్టాలో, ట్విట్టర్‌లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, వీడియోలే దర్శనమిస్తున్నాయి. బాలాజీ సాహిత్యం అందించిన ఈ పాటను ప్రముఖ సింగర్ మోహిత్ చౌహాన్ ఆలపించగా, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ కాళ్లు కదిపేలా చేస్తున్నాయి.
అలాంటి ఈ పాటపై ఇటీవల పలు విమర్శలు సైతం వచ్చాయి. ఈ పాట ట్యూన్ విజయ్ స్నేహితుడు సినిమాలోని పాటను, రచ్చ సినిమాలోని ‘వానా వానా వెల్లువాయే’ పాటను పోలి ఉందంటూ పలువురు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ పాట పూర్తిగా బయటకు రాకముందే రిలీజ్ చేసిన ప్రోమోను చూసి ఈ విమర్శలు రావడం విశేషం. అంతేకాక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కూడా ట్యూన్స్ కాపీ చేస్తున్నారంటూ విమర్శలు రావడం గమనార్హం. అయితే ‘చికిరి చికిరి’ పూర్తి పాట వచ్చిన తర్వాత ట్రోలింగ్ అంతగా కనిపించకపోవడం విశేషం.
కాకపోతే ఈ పాట లిరిక్స్ బాగానే ఉన్నా, తెలుగు తెలియని గాయకుడితో పాడించడంతో ఉచ్చారణ దోషాలు వినిపించాయని, అసలు సింగర్ పలికే పదాలు సరిగ్గా అర్థం కావడం లేదని, పైగా పాట ట్యూన్‌లో కాస్త గ్యాప్ లేకుండా చాలా స్పీడుగా సాగిందనే కామెంట్లు వచ్చాయి. మరోవైపు జానీ మాస్టర్ సమకూర్చిన డ్యాన్స్ స్టెప్పులు కూడా నాలుగు–ఐదు పాత సినిమాలలో నుంచి తీసుకున్నవంటూ చర్చలు సాగుతున్నాయి. అల్లు అర్జున్ పుష్పలోని శ్రీవల్లి పాట తరహాలో స్టెప్పులు కంపోజ్ చేశారంటూ ట్విట్టర్‌లో చర్చ జరుగుతోంది. అయితే రామ్‌చరణ్ అభిమానులు ఆ విమర్శలను కొట్టి పారేస్తున్నారు. ఆ పాటలతో పోలిస్తే ‘చికిరి చికిరి’ పాటలో ట్యూన్, ఆలాపన, డ్యాన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయని, అందుకే జనం ఇంతగా ఇష్టపడుతున్నారంటూ తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు.
ఇలా ఎన్ని విమర్శలు ఉన్నా, ఈ పాటకు వస్తున్న ఆదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియాలో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. కేవలం రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే దాదాపు 5 కోట్ల వ్యూస్ దగ్గరకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే, మున్ముందు ఈ పాట మరింత కాలం సామాజిక మాధ్యమాలను అల్లాడించడం ఖాయమని చెప్పొచ్చు.