Badass: బ్యాడాస్ టైటిల్ పై త్రివిక్రమ్ అభిమానులు ఆవేదన
ABN, Publish Date - Jul 09 , 2025 | 03:11 PM
సిద్ధూ జొన్నలగడ్డ తాజా చిత్రానికి 'బ్యాడాస్' అనే టైటిల్ పెట్టారు. పైకి ఇది టఫ్ గై అనే అర్థాన్ని తెలియచేసినా... స్లాంగ్ లో వచ్చే విపరీతార్థంపై కొందరు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.
సినిమా రంగంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ను ఆయన అభిమానులు కొందరు ప్రేమగా గురూజీ (Guruji) అని పిలుచుకుంటారు. ప్రేక్షకులలోనూ కొందరు గౌరవభావంతో త్రివిక్రమ్ ను అలా సంబోధిస్తుంటారు. త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలు కుటుంబ సమేతంగా చూసేలా ఉంటాయని ఆనంద పడుతుంటారు. ఆ సినిమాలకు ఎలాంటి టాక్ వచ్చినా... తప్పనిసరిగా ఒక్కసారి అయినా థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపుతుంటారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను తన వైపు తిప్పుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు కేవలం దర్శకుడు మాత్రమే కాదు... నిర్మాత కూడా!
త్రివిక్రమ్ 'ఫార్చూన్ ఫోర్ సినిమాస్' అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. దానికి అధినేత్రి ఆయన భార్య సాయి సౌజన్య (Sai Soujanya) . ఈ సంస్థ సోలోగా కాకుండా కేవలం సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) తో కలిసి మాత్రమే సినిమాలను నిర్మిస్తోంది. గతంలో ఇలా సొంత నిర్మాణ సంస్థ లేనప్పుడు కూడా త్రివిక్రమ్ హారిక అండ్ హాసినీ సంస్థలోనూ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లోనూ భాగస్వామిని వార్తలు వస్తుండేది. బాబాయ్ అబ్బాయిలు సూర్యదేవర రాధాకృష్ణ (Suryadevara Radhakrishna), సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) లకు త్రివిక్రమ్ అన్ని విషయాలలో వెన్నుదన్నుగా నిలిచి ఉంటాడని అంటారు. ఇలా స్లీపింగ్ పార్టనర్ గా కాకుండా అధికారికంగానే తానూ ఓ బ్యానర్ ను పెట్టి, అందులో భాగస్వామ్యం తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుని ఉండొచ్చు. అందులో ఎలాంటి తప్పూలేదు. కానీ ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమాలను తలుచుకుంటేనే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది.
త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినిమాలు, అందులోని సన్నివేశాలు, వాటి పోకడలు చూసి... ఇదేమిటీ ఇలాంటి సినిమాలు ఈ బ్యానర్ నుండి వస్తున్నాయని అనుకుంటున్నారు. 'డీజే టిల్లు (DJ Tillu), టిల్లు స్క్వేర్' (Tillu Square) సినిమాలు చూసిన వారు, అందులో సంభాషణలు విన్నవారు నోరెళ్ళబెట్టారు. అయితే ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇదే సక్సెస్ ఫార్ములాగా భావించి ఆ బ్యానర్ నుండి కొంతకాలంగా అదే తరహా సినిమాలను నిర్మించడం మొదలు పెట్టారు.
చిత్రం ఏమంటే... అందుకు కాస్తంత భిన్నంగా ప్రముఖ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్... సిద్ధు జొన్నలగడ్డతో నిర్మించిన 'జాక్' (Jack) బాక్సాఫీస్ బరిలో బోల్తా కొట్టింది. దాంతో ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్, కుర్రకారుని కిర్రెక్కించే సీన్స్ ఉంటేనే ఇవాళ సినిమా థియేటర్లకు జనం వస్తారనే భావనలో సదరు నిర్మాతలు పడిపోయినట్టుగా అనిపిస్తోంది. దాంతో సిద్ధూ జొన్నలగడ్డతో తాజాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ తీస్తున్న సినిమాకు బోల్డ్ టైటిల్ పెట్టారు. అంతేకాదు... దాని ట్యాగ్ లైన్ సైతం వివాదాలకు తెర లేపేదిగా ఉంది. ఇంతకూ మూవీ టైటిల్ ఏంటంటే... 'బ్యాడాస్' (Badass). ఇక దీని ట్యాగ్ లైన్ “If middle finger was a man” అట! హీరో క్యారెక్టరైజేషన్ ను ప్రతిఫలించేలా ఈ టైటిల్ పెట్టినట్టు మేకర్స్ చెబుతున్నారు. దీని అర్థం పైకి చెప్పుకోవడానికి ఎలా ఉన్నా... స్లాంగ్ లో దీన్ని బూతు మాటగానే ఉపయోగిస్తారు.
గతంలో సిద్దూ జొన్నలగడ్డలో 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాను, ఆ మధ్య యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాలతో 'బబుల్ గమ్' సినిమాలను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరెపు దీనికి దర్శకుడు. వేరే ఏ నిర్మాణ సంస్థో... ఏ దర్శకుడో ఇలాంటి సినిమాలను తీస్తే ఎవరూ పెద్దంతగా పట్టించుకోరు. కానీ త్రివిక్రమ్ లాంటి వ్యక్తి ఇలాంటి స్క్రిప్ట్స్ కు, ఇలాంటి పేర్లకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో అర్థం కావడం లేదని ఆయన అభిమానులు వాపోతున్నారు. సక్సెస్ కోసం... నాలుగు కాసుల కోసం త్రివిక్రమ్ కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ను ఓకే చేసేస్తారా? అని బాధ పడుతున్నారు. వీళ్ల ఆక్రోశం, ఆవేదన మరి త్రివిక్రమ్ వరకూ చేరుతుందో లేదో చూడాలి!
Also Read: Samantha: రాజ్‌తో.. సమంత చట్టాపట్టాల్! రూమర్స్ నిజమేనా
Also Read: Alia Bhatt: ఆలియా భట్‌కు షాక్: ఫేక్ బిల్లులతో.. రూ.77 లక్షల మోసం