Megastar: చిరంజీవితోనే రీ-ఎంట్రీ...

ABN , Publish Date - May 20 , 2025 | 09:15 AM

నాలుగు పదులు దాటిన త్రిష, నయనతార తమ అందాల సోయగంతో ఇప్పటికీ అదుర్స్ అనిపిస్తున్నారు... దాంతో సీనియర్ హీరోలకు వారిద్దరే ఫస్ట్ ఛాయిస్ గా మారారు... ఇద్దరూ తమిళనాట తకధిమితై అనిపిస్తూనే తెలుగు సినిమాల్లో మరోమారు తడాఖా చూపించే పనిలో ఉన్నారు.

ప్రస్తుతం తమిళనాట టాపు రేపుతున్న ముదురుభామలు ఎవరు అంటే త్రిష (Trisha), నయనతార (Nayantara) పేర్లే వినిపిస్తాయి. ఇద్దరిలో త్రిష ఓ యేడాది పెద్దది. నయనతార త్రిష కన్నా చిన్నదే అయినా స్టార్ డమ్ లో పెద్ద అనిపించుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంతమంది వస్తున్నా, ఈ ఇద్దరి క్రేజ్ తగ్గడం లేదని తమిళ తంబీలు అంటున్నారు. అలాగే తెలుగులోనూ వీరికి మంచి గుర్తింపు ఉండడం వల్ల వారు నటించిన తమిళ చిత్రాలు డబ్బింగ్ రూపంలో తెలుగువారిని పలకరిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు భామలు కొంత గ్యాప్ తరువాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తూ ఉండడం విశేషం!

త్రిష, నయనతార ఇద్దరిలో ముందుగా తెలుగువారిని పలకరించింది త్రిషనే. 'నీ మనసు నాకు తెలుసు' ద్విభాషా చిత్రంలో తొలిసారి తళుక్కుమన్నా, తరువాత 'వర్షం'తో కుర్రకారును వణికించేసింది త్రిష. నయనతార 'చంద్రముఖి' (Chandramukhi) డబ్బింగ్ తో మన ప్రేక్షకులకు దగ్గరైనా, మొదటిసారి 'లక్ష్మీ' (Lakshmi) స్ట్రెయిట్ మూవీతో మురిపించింది. త్రిష 2016లో 'నాయకి' తెలుగు చిత్రంలో నటించింది.. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి (Chiranjeevi) 'విశ్వంభర' (Vishwambhara) తో తెలుగు జనాన్ని పలకరించే ప్రయత్నంలో ఉంది. అంటే దాదాపు తొమ్మిదేళ్ళ తరువాత త్రిష తెలుగు సినిమాలో నటిస్తోందన్న మాట. ఇక నయన్ విషయానికి వస్తే మూడేళ్ళ క్రితం చిరంజీవి 'గాడ్ ఫాదర్' (Godfather) లో ఆయనకు చెల్లెలు పాత్రలో కనిపించింది నయన్. ఇప్పుడు చిరంజీవి 157 సినిమాలో నాయికగా ఎన్నికైంది నయనతార. మరో విశేషమేంటంటే ఈ ఇద్దరు ముదురు భామల టాలీవుడ్ రీ ఎంట్రీ చిరంజీవితోనే కావడం!


గతంలో చిరంజీవి సరసన 'స్టాలిన్'లో నటించింది త్రిష. మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన 'స్టాలిన్' ఓపెనింగ్స్ అదరహో అనిపించినా, తరువాత అంతగా మురిపించలేక పోయింది. ఇక చిరంజీవి జంటగా నయనతార 'సైరా-నరసింహారెడ్డి'లో కనిపించింది. ఆ సినిమా సైతం భారీ ఓపెనింగ్స్ చూసినా, తరువాత మెత్తబడింది. అలా చిరంజీవితో త్రిష, నయన్ ఇద్దరూ అలరించారు కానీ, బ్లాక్ బస్టర్స్ అయితే అందుకోలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి సరసన వీరిద్దరూ నటిస్తున్న సినిమాలపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది... మరి వీరిద్దరిలో ఎవరు బంపర్ హిట్ పట్టేస్తారో, తరువాత టాలీవుడ్ లో మళ్ళీ ఎవరు హల్ చల్ చేస్తారో చూడాలి.

Also Read: ఆగస్టు 29న విశాల్‌ సాయి ధన్షిక వివాహం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 20 , 2025 | 09:15 AM