సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kota Srinivasa Rao: విలక్షణ నటనకు వినమ్ర నివాళి

ABN, Publish Date - Jul 14 , 2025 | 05:14 AM

తన విలక్షణ నటనతో తెలుగు సినీరంగంపై చెరగని ముద్రవేసిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి గురైంది. వృత్తిపరమైన, వ్యక్తిగత అనుబంధం కలిగిన...

తన విలక్షణ నటనతో తెలుగు సినీరంగంపై చెరగని ముద్రవేసిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మృతితో చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి గురైంది. వృత్తిపరమైన, వ్యక్తిగత అనుబంధం కలిగిన పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నటులు రాజేంద్రప్రసాద్‌, మురళీ మోహన్‌, ప్రకాశ్‌రాజ్‌, తనికెళ్ల భరణి, నిర్మాత సురేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ తదితరులు కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు.

కామెడీ త్రయం

కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్‌, బ్రహ్మానందం ముగ్గురూ కలసి అనేక చిత్రాల్లో నటించారు. కామెడీ త్రయంగా వీరు పంచిన వినోదం ఆల్‌టైమ్‌ సూపర్‌ హిట్‌. వీరి ముగ్గురిని కలిపి సినిమా చేసేందుకు నిర్మాతలకు డేట్స్‌ దొరకడం కష్టమయ్యేది. చాలా సినిమాల్లో కోట శ్రీనివాసరావు విలన్‌గా నటించగా... బాబూ మోహన్‌, బ్రహ్మానందం హాస్యనటులుగా, సహాయకులుగా రక్తి కట్టించారు. వెండి తెరపై వీరు ముగ్గురు కలసి చేసిన కామెడీ సన్నివేశాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఒక రకంగా చెప్పాలంటే వీరిది ఎవర్‌గ్రీన్‌ కాంబినేషన్‌. ‘అల్లరి మొగుడు’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘అందాల రాక్షసి’, ‘అల్లరి ప్రియుడు’, ‘సమరసింహారెడ్డి’ వంటివి వీరు నటించిన పలు విజయవంతమైన చిత్రాలు. కాగా, కోట శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బూబూ మోహన్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘కోటన్న లేడంటే నమ్మలేకపోతున్నా..’ అంటూ భోరున విలపించారు.


ఇద్దరూ కలసి వందకు పైగా

కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్‌ కలసి వందకు పైగా సినిమాల్లో నటించారు. ‘మామగారు’ సినిమాలో బాబూ మోహన్‌ను కోట శ్రీనివాసరావు వెనుక నుంచి తన్నే సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోతాయి. తన చేతుల్లో బాబూ మోహన్‌ ఎక్కువ దెబ్బలు తినేవాడని అందరూ అనుకుంటారని కానీ, తాను అలా టచ్‌ చేస్తే వెళ్లిపడిపోయేవాడని కోట ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కోట- బాబూ మోహన్‌ కాంబినేషన్‌ తమ చిత్రాల్లో ఉండాలని హీరోలు డిమాండ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి.

ఎన్టీఆర్‌ను అనుకరిస్తూ సినిమా.. వివాదం

ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్నారు కోట శ్రీనివాసరావు. అయితే ఓ సినిమాలోని పాత్రతో ఆయనను వివాదాలు చుట్టుముట్టాయి. అది ఆయన కెరీర్‌ తొలినాళ్లలో చేసిన ‘మండలాధీశుడు’. ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా సమయంలో జరిగిన పరిణామాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కోట శ్రీనివాసరావు. ‘నా పిలుపే ప్రభంజనం’ అనే సినిమాలో నేను ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ చెప్పాను. అది ప్రేక్షకులకు నచ్చింది. ఈ సినిమా చూసి నాకు ‘మండలాధీశుడు’లో అవకాశం ఇచ్చారు దర్శకుడు ప్రభాకర్‌ రెడ్డి. అది ఎన్టీఆర్‌ను అనుకరిస్తూ చేసే పాత్ర. మొదట నేను చేయననే చెప్పాను. రామారావు అప్పటి ముఖ్యమంత్రి కాబట్టి ఒకవేళ పాత్ర క్లిక్‌ అయితే మంచి అవకాశాలొస్తాయి అనే ఉద్దేశంతో అంగీకరించాను. ఆ సినిమా చూస్తే ఎక్కడా ఎన్టీఆర్‌ను విమర్శించినట్లు ఉండదు. ఎన్టీఆర్‌కు జీవితంలో ఎదురైన సంఘటనలు, ఇతరులతో ఆయన వ్యవహరించే తీరు మాత్రమే ఇందులో ఉంటుంది. కానీ ఈ సినిమా విడుదలయ్యాక ఓ ఏడాది పాటు కష్టాలు నన్ను వెంటాడాయి.


విజయవాడలో ఎన్టీఆర్‌ అభిమానులు నాపై దాడి చేయడం ఎంతో బాధించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా సమయంలో డబ్బింగ్‌ కోసం ఎన్టీఆర్‌ చెన్నై వచ్చారు. అప్పుడు ఆయన్ను కలవొద్దని చాలా మంది హెచ్చరించారు. కానీ నేను వెళ్లి ఆయన్ని పలకరించా. ఆయన నన్ను చూసి ‘మీరు గొప్ప నటుడని విన్నా బ్రదర్‌. మీరెన్నో గొప్ప పాత్రలు చేయాలి’ అని ప్రోత్సహించారు. వెంటనే ఆయన కాళ్ళపై పడిపోయా. ఆ తర్వాత బాలకృష్ణతో ‘రౌడీ ఇన్సెపెక్టర్‌’ సినిమాలో అవకాశం దక్కింది. నేను నటించడానికి బాలకృష్ణ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దాంతో ‘మండలాధీశుడు’తో ఏర్పడిన వివాదం సమసిపోయింది’ అని తెలిపారు.

నటనకు పరిపూర్ణ రూపం

కోట శ్రీనివాసరావుగారు ఇకలేరనే వార్త వారి కుటుంబానికే కాదు, పరిశ్రమకూ తీరని లోటు. అలాంటి వైవిధ్యమైన పాత్రలు పోషించే నటుడు మళ్లీ వస్తారని నేను అనుకోవడం లేదు. మా ఇద్దరి నట ప్రస్థానం ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో ప్రారంభమైంది. సుదీర్ఘమైన నట ప్రస్థానంలో మా అనుబంధం ఎంతగానో పెనవేసుకుంది. తెరమీద ఆయన నటన అద్భుతం. బయట ఆయన హాస్యచమత్కారం కూడా అంతే అద్భుతం.

- చిరంజీవి

ఆయన మాట నన్ను కదిలించింది

బాబూమోహన్‌, కోటగారి కాంబినేషన్‌ను మేం విపరీతంగా ఎంజాయ్‌ చేసేవాళ్లం. నా తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో మొదలై ‘అత్తారింటికి దారేది’ వరకూ ఆయనతో కలసి నటించా. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను నాతో పంచుకునేవారు. కోట గారి మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు. పదిమంది బాగుకోరే వ్యక్తి. అత్తారింటికి దారేది చిత్రంలో నటించేటప్పుడు ఆయన్ను ఈ వయసులో నటిస్తూ ఇబ్బంది పడడం ఎందుకు అని అడిగితే ‘నా బాధను మరిచిపోవడానికి నటనే నాకు మందు’ అన్నారు. అది నన్ను బాగా కదిలించింది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌


సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం

రెండు రోజుల కిందటే ఇద్దరం మాట్లాడుకున్నాం, ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పా. నేనొచ్చేసరికి ఆయన లేడు. నా కోటన్న వెళ్లిపోయాడు. ఇంటికొచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అప్యాయంగా మాట్లాడేవారు. ఆయనకు అన్నదమ్ములున్నా, నన్నే తన సొంత తమ్ముడిగా భావించేవాడు. షూటింగ్‌కు సమయం తక్కువగా ఉన్నప్పుడు అన్నం కలిపి పెట్టేవాడు. ఏ ఊరికి ఘూటింగ్‌కు వెళ్లినా, పక్కపక ్క గదుల్లోనే ఉండేవాళ్లం. ఇలా మా జీవితంలో ఎన్నో మఽఽధుర జ్ఞాపకాలు ఉన్నాయి.

- బాబూమోహన్‌

కోట మహానటుడు

ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబూమోహన్‌... మేం ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్లం. ఆయన మహానటుడు. రోజుకి 18, 20 గంటలు పనిచేసేవాళ్లం. ‘అరేయ్‌ ఒరేయ్‌’ అని పిలుచుకునే వాళ్లం. కోట లేడని అంటే నమ్మలేకపోతున్నా. నటన ఉన్నంత వరకు కోట మన హృదయాల్లో జీవించే ఉంటారు.

బ్రహ్మానందం

వ్యక్తిగతంగా తీరని లోటు

నా తొలి చిత్రం నుంచి కోట శ్రీనివాసరావుతో దగ్గరి అనుబంధం ఉంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ప్రతి సినిమాలో కోట గారు నటించారు.

ఇద్దరం కలసి ‘శత్రువు, గణేశ్‌, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లాంటి ఎన్నో మంచి చిత్రాలు చేశాం. వారి మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.

వెంకటేశ్‌

కోట శ్రీనివాసరావుగారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా జీవితంలోనూ మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు.

- నందమూరి బాలకృష్ణ


నాకెంతో ఇష్టమైన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన ప్రతిభ, ఉనికి, మంచి మనసును ఎప్పటికీ మర్చిపోలేం. మాటల్లో చెప్పలేని దుఃఖం కలుగుతోంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.

మోహన్‌బాబు

కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు పరిశ్రమతో పాటు వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయనతో గడిపిన క్షణాలు మరువలేనివి. గొప్ప నటుడు, మంచి మనిషిని కోల్పోయాం.

నాగార్జున

తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. తన నటనతో ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

మహేశ్‌బాబు

కోట శ్రీనివాసరావు గారు ఇక లేరనే వార్త కలచివేసింది. పోషించిన ప్రతి పాత్రకు తన ప్రతిభతో ప్రాణం పోశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయగల నటులు లేరు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.

రాజమౌళి

మద్రా్‌సలో ఉన్నప్పటి నుంచే మా కుటుంబానికి కోట గారితో అనుబంధం ఉంది. మా నాన్నగారికి ఆయనంటే చాలా ఇష్టం. వారితో ఉన్నప్పుడు సమయమే తెలిసేది కాదు. వారి వ్యక్తిత్వం మర్చిపోలేం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి

అల్లు అరవింద్‌

ఎనలేని నటనా చాతుర్యంతో ప్రతి పాత్రకూ తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

ఎన్టీఆర్‌

సినీ పరిశ్రమ కోట శ్రీనివాసరావు గారి లాంటి విలక్షణ నటుణ్ణి కోల్పోయింది. ఆయన మృతి సినీరంగానికి తీరని లోటు. ఆయన చేసిన అద్భుతమైన పాత్రలు మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కోట శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూర్చి, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

రామ్‌చరణ్‌

Updated Date - Jul 14 , 2025 | 05:21 AM