2016-2025 Tollywood: పదేళ్లు.. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ఇవే! ఆ మూడు స్పెషల్
ABN , Publish Date - Dec 17 , 2025 | 02:05 PM
అప్పుడే 2025 పాతదై పోతోంది. 2026 వైపు జనం ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే గత పదేళ్ళలో టాప్ హిట్స్ గా నిలచిన టాలీవుడ్ మూవీస్ పైనా ఓ చూపేశారు. ఇంతకూ ఈ డికేడ్ లో టాప్ హిట్స్ గా నిలచిన మూవీస్ ఏంటో చూద్దాం.
ప్రతి యేటా ఏదో ఒక సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ ఉంటుంది. థియేట్రికల్ రన్ పరంగా, కలెక్షన్స్ పరంగా టాప్ లో నిలచిన చిత్రాలను బ్లాక్ బస్టర్స్ అంటూంటారు. ఈ యేడాది టాలీవుడ్ పెర్ఫామెన్స్ చాలా పూర్ గా ఉందనే చెప్పాలి. అయితే కొన్ని సినిమాలు మాత్రం అదరహో అనిపించాయి. 2025లో టాప్ గ్రాసర్ అంటే వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే చెప్పాలి. ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే రిలీజై 300 కోట్లు పోగేసింది. అంతేకాదు, ఈ చిత్ర నిర్మాణానికి కేవలం 50 కోట్లు వెచ్చించారు. అందువల్ల ఎక్కువ లాభాలు చూపిన చిత్రం కాబట్టి 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాన్నే 2025 బ్లాక్ బస్టర్ గా భావించాలి.
తెలుగు సినిమా వెలుగులు దశదిశలా విరజిమ్మడం 2015లో వచ్చిన 'బాహుబలి-ద బిగినింగ్'తోనే మొదలయింది. అయితే ఈ దశాబ్దం అంటే 2016 నుండి 2025 వరకు సాగిన పదేళ్ళనే లెక్కించాలి. 2016లో 'జనతా గ్యారేజ్' మూవీ 130 కోట్లు సాధించి, ఆ యేడాది టాప్ హిట్ గా నిలచింది. 2017లో 'బాహుబలి-ద కంక్లూజన్' ఏకంగా 1810 కోట్ల రూపాయలు సంపాదించింది. అంతేకాదు, మన దేశంలో తొలి వెయ్యి కోట్ల క్లబ్ కు శ్రీకారం చుట్టిన చిత్రంగానూ 'బాహుబలి-2' నిలచింది.
ఆ స్థాయిలో ఇప్పటి దాకా అలరించిన తెలుగు చిత్రం మరోటి కనిపించదు. 2018లో 'రంగస్థలం' 218 కోట్లతో ఆ యేడాది టాప్ హిట్ గా నిలచింది. 2019లో 'సాహో' సినిమా ప్రభాస్ క్రేజ్ వల్ల 433 కోట్లతో ఆ యేడాది టాప్ గ్రాసర్ అనిపించుకుంది. 2020లో 'అల వైకుంఠపురములో' 262 కోట్లు పోగేసి బ్లాక్ బస్టర్ గా జేజేలు అందుకుంది. 'బాహుబలి-2, సాహో' చిత్రాలు మినహాయిస్తే మిగిలిన మూడు సినిమాలు పాన్ ఇండియా మూవీస్ కాకపోవడం గమనార్హం !
ఈ డికేడ్ లో పలు పాన్ ఇండియా మూవీస్ వెలుగు చూశాయి. అయితే కొన్నే జయకేతనం ఎగురవేశాయి. 2021లో 'పుష్ప-ద రైజ్' 373 కోట్లు పోగేసి బంపర్ హిట్ అనిపించుకుంది. 2022లో 'ట్రిపుల్ ఆర్' మూవీ 1316 కోట్ల రూపాయలు సంపాదించి బ్లాక్ బస్టర్ అయింది. 2023లో 715 కోట్లు సాధించిన 'సలార్-ద సీజ్ ఫైర్' ఆ యేడాది టాప్ హిట్ గా నిలచింది. 2024లో 'పుష్ప-ద రూల్' మూవీ 1700 కోట్లు పోగేసి బ్లాక్ బస్టర్ గా వెలిగింది. 2025 విషయానికి వస్తే 'ఓజీ' కూడా 300 కోట్ల దాకా పోగేసినా, అది పాన్ ఇండియా మూవీగా రిలీజయింది. తెలుగులో మాత్రమే రూపొంది ఘనవిజయం సాధించి 300 కోట్లు చూసిన 'సంక్రాంతికి వస్తున్నాం'నే బ్లాక్ బస్టర్ అనక తప్పదు. ఇలా పదేళ్ళలో బ్లాక్ బస్టర్స్ గా నిలచిన ఈ చిత్రాల సరసన రాబోయే 2026లో ఏ మూవీ నిలుస్తుందో అని సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఛాన్స్ ఏ సినిమాకు దక్కుతుందో చూడాలి.
Also Read: Jailer 2: నిన్న తమన్నా... నేడు నోరా ఫతేహీ