James Cameron, SS Rajamouli: వార‌ణాసి.. సెట్‌కు రావాల‌ని ఉంది! కామెరాన్, రాజమౌళి మ‌ధ్య‌ ఆసక్తికర చర్చ

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:22 PM

విశ్వమంతా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం అవ‌తార్ ఫైర్ అండ్ యాష్ మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

James Cameron, SS Rajamouli

విశ్వమంతా వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న హాలీవుడ్ చిత్రం అవ‌తార్ ఫైర్ అండ్ యాష్ (Avatar: Fire & Ash) మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో అన్ని దేశాల్లో సినిమా ప్ర‌మోష‌న్లు అంత‌కుమించి అనే త‌ర‌హాలో జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా అవ‌తార్ ద‌ర్శ‌కుడు ది గ్రేట్ జేమ్స్ కామ‌రూన్ (James Cameron) ఇండియ‌న్ కామ‌రూన్ రాజ‌మౌళి (SS Rajamouli) మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం, కథలో భావోద్వేగాల ప్రాధాన్యం, సినిమా విడుదల సమయాల్లో దర్శకులు ఎదుర్కొనే ఒత్తిడి వంటి ప‌లు కీల‌క అంశాలు ఈ సంభాషణలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈ క్ర‌మంలో ఈ సినిమాను వీక్షించిన అనంతరం రాజమౌళి తన అనుభవాన్ని పంచుకుంటూ.. థియేటర్‌లో ఓ చిన్నపిల్లాడిలా స్క్రీన్‌ను వదలకుండా చూస్తూ ఉండిపోయాను అని చెప్పారు. విజువల్ గ్రాండియర్‌తో పాటు ఎమోషనల్ డెప్త్‌ను కూడా అదే స్థాయిలో హైలెట్ చేయ‌డంపై కామెరాన్ ప్రత్యేకతను నిరూపించుకున్నార‌ని ఆయన ప్రశంసించారు. అంతేగాక హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో అవతార్ చిత్రం ఏడాది పాటు ప్రదర్శించబడిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ ఫ్రాంచైజీ బిగ్ స్క్రీన్ ఎక్స్‌ఫీరియ‌న్స్‌కు కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని అన్నారు.

ఆపై జేమ్స్ కామెరాన్, రాజమౌళి సినిమాటిక్ ఆలోచన విధానాన్ని మెచ్చుకుంటూ, ఆయనతో కలిసి పని చేసే అవకాశం వస్తే ప‌ని చేయాల‌ని ఉంద‌ని, భారతీయ దర్శకుడి సినిమా సెట్‌ను ప్రత్యక్షంగా చూడాల‌ని ఉంది, అవ‌స‌ర‌మైతే కెమెరా ప‌ట్టుకుని కొన్ని షాట్లు కూడా తీసి పెడ‌తాన‌ని త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట పెట్టారు. అందుకు రాజ‌మౌళి సైతం ఇట్స్ అవ‌ర్ ఫ్లెజ‌ర్‌, ఎనీ టైం మా సెట్‌కు రావోచ్చ‌ని అది మా అదృష్టం అంటూ కామ‌రూన్‌ను వార‌ణాసి సినిమా సెట్‌కు రావాల‌ని ఆహ్వానించారు. అంతేగాక త‌ప్ప‌నిస‌రిగా ఆ టైం వ‌స్తుంద‌ని, మా సిటీ హైద‌రాబాద్‌కు తీసుకువ‌స్తామ‌ని అన్నారు.

Updated Date - Dec 17 , 2025 | 01:43 PM