Tollywood Rain Songs: చినుకూ చిటికేస్తోంది...
ABN , Publish Date - Jul 26 , 2025 | 07:23 PM
వాన కాలం వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనేక ఊళ్ళలో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరికొందరికి వర్షం మాత్రం సరదాగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ కురిసే వానలు చూసి మన తెలుగు సినిమాల్లోని వానపాటలను గుర్తు చేసుకుంటున్నారు కళాపిపాసులు.
తెలుగునాట వాన పాటలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి రెండే రెండు పాటలు... వాటిలో ఒకటి 1964 నాటి 'ఆత్మబలం' (Athma Balam) చిత్రంలోని 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...' అంటూ సాగే పాట. కేవీ మహదేవన్ స్వరాల్లో రూపొందిన ఈ పాట ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలువారింది. అప్పట్లో వర్షం పడుతూఉంటే ఈ పాటనే ముందుగా తలచుకొనేవారు సినీఫ్యాన్స్. ఆ తరువాత అనేక చిత్రాలలో వానపాటలు చోటు చేసుకున్నా, అవి 'చిటపట చినుకులు'ను మరిపించలేక పోయాయి. దాదాపు 15 ఏళ్ళ తరువాత 1979లో జనం ముందు నిలచిన 'వేటగాడు' (Vetagadu) లో వేటూరి సుందరరామ్మూర్తి రాసిన 'ఆకుచాటు పిందె తడిసె...' అనే పల్లవితో మొదలయ్యే గీతం విశేషంగా ఆకట్టుకుంది. చక్రవర్తి సంగీతం సమకూర్చిన ఈ పాట థియేటర్లలో జనాన్ని చిందులు వేయించింది.
'వేటగాడు'కు ముందు ఎన్ని వాన పాటలు వచ్చినా అవేవీ ట్రెండ్ క్రియేట్ చేయలేక పోయాయి. 'వేటగాడు'లోని వానపాట అలరించిన తీరు, ఆ సినిమా సాధించిన ఘనవిజయం చూశాక అనేక తెలుగు చిత్రాలలో వానపాటలు వరుసగా చోటు చేసుకుంటూ వచ్చాయి. ఆ తరువాతి రోజుల్లో తమ సినిమాలో 'రెయిన్ సాంగ్ ఉంది' అంటూ మేకర్స్ గర్వంగా చెప్పుకొనేవారు. తరువాతి తరం హీరోల్లో చిరంజీవి (Chirajeevi), బాలకృష్ణ (Balakrishna) చిత్రాల్లో పోటాపోటీగా వానపాటలు అభిమానులను తడిపి ముద్ద చేశాయి. 'వేటగాడు'కు ముందు తరువాత తెలుగు సినిమాల్లో అలరించిన కొన్ని పాటలను మీ ముందు ఉంచుతున్నాం. ఇవి చూశాక మీకు కూడా కొన్ని వాన పాటలు గుర్తుకు రావచ్చు. ఆలోచించండి!
తెలుగు సినిమాల్లో అలరించిన కొన్ని వాన పాటలు :
1. 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...' (ఆత్మబలం - 1964)
2. 'ఆకుచాటు పిందె తడిసె...' (వేటగాడు - 1979)
3. 'చిటపటా చినుకులూ...' (ఏజెంట్ గోపి -1978)
4. 'వాన వెలిసిన వేళ...' (ఘరానాదొంగ -1980)
5. 'ఎండావానా నీళ్ళాడాలి...' (దేవత -1982)
6. 'వానా వానా వందనం...' (అడవిదొంగ -1985)
7. 'వచ్చె వచ్చె వానజల్లు...' (దేశోద్ధారకుడు -1986)
8. 'వాన జల్లే గిల్లుతుంటే...' (యముడికి మొగుడు - 1988)
9. 'వానా వానా వెల్లువాయె...' (గ్యాంగ్ లీడర్ - 1991)
10. 'స్వాతిలో ముత్యమల్లె...' (బంగారుబుల్లోడు - 1993)
11. 'స్వాతి ముత్యపు జల్లులలో...' (ప్రేమయుద్ధం - 1990)
12. 'ఏం వానో తరుముతున్నది...' (నారీ నారీ నడుమ మురారి - 1990)
13. 'వాన చినుకులు...' (సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు - 2013)
14. 'వానా వానా... తేనెల వానా...' (డాడీ -2001)
15. 'మెల్లగా కరగనీ... ఈ వర్షం సాక్షిగా...' (వర్షం -2004)
16. 'మేఘం కరిగెను...' (నాగ - 2003)
17. 'చినుకు చినుకు అందెలతో...' (మాయలోడు - 1993)
18. 'కురిసింది వానా...' (బుల్లెమ్మా బుల్లోడు -1972 )
19. 'చలి చలిగా ఉందిరా...' (మా ఇద్దరి కథ - 1977)
20. 'చిటపట చినుకుల మేళం...' (ముద్దుల కొడుకు - 1979)