Weekend Telugu Movies: ఈవారం.. థియేట‌ర్ల‌కు వ‌స్తున్న‌ సినిమాల ప్ర‌త్యేక‌త‌లివే! ఎవ‌రు నిల‌బ‌డ‌తారో.. ఎవ‌రు ప‌డిపోతారో

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:29 PM

వీకెండ్ వచ్చేసింది. టాలీవుడ్‌లో సినీ సందడి మొదలైంది. ప్రతి శుక్రవారం లాగే ఈ వారం కూడా అరడజను సినిమాలు సందడి చేయడానికి సిద్థమయ్యాయి. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సైతం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ వారంతంలో విడుదలయ్యే చిత్రాలేమిటో తెలుసుకుందాం.

Theater Movies

శుక్రవారం వచ్చేస్తోంది. సినీ సందడి మొదలుకానుంది. భారీ పాన్ ఇండియా సినిమాలు రేస్ లో లేకపోవడంతో చిన్న, మధ్యతరగతి బడ్జెట్ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. ఏకంగా ఏడెనిమిది సినిమాలు పోటీపడటంతో పాటు తమ ఆధిపత్యం చాటేందుకు సిద్ధమవుతున్నాయి. రేస్ లో ఐదు తెలుగు సినిమాలు, నాలుగు డబ్బింగ్ చిత్రాలు ఉండటంతో బాక్సాఫీస్ ఓ మినీ ఫెస్టివల్‌లా మారనుంది. ఈ వారం రిలీజ్ లిస్ట్ చూస్తేనే విభిన్నత కనిపిస్తుంది. రొమాంటిక్ డ్రామాలు, థ్రిల్లర్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.


నవంబర్ 7న తెలుగు నుంచి ఐదు సినిమాలు, తమిళ్ నుంచి రెండు సినిమాలు, మలయాళం నుండి ఒక సినిమా, ఇంగ్లీష్ నుండి ఒక సినిమా విడుదల కాబోతున్నాయి. రశ్మిక మందణ్ణ నటిస్తున్న 'ద గర్ల్ ఫ్రెండ్' మూవీ నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇతర భాషల్లో వచ్చే వారం విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక సుధీర్ బాబు నటిస్తున్న 'జటధార' సైతం తెలుగు, హిందీ భాషల్లో వస్తోంది. ఈ సినిమాతో శిల్పా శిరోద్కర్, దివ్యా ఖోస్లా తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. శతృఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా తొలిసారి ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక 'మసూద' ఫేమ్ తిరువీర్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో’కు ఊహించిన బజ్ క్రియేట్ అయ్యింది. సినిమా విజయంపై ధీమాతో మేకర్స్ రెండు రోజుల ముందు ప్రెస్ షో వేశారంటే వాళ్ళ నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు చిన్న సినిమాలు 'ప్రేమిస్తున్నా', 'కృష్ణలీల' రిలీజ్ కానున్నాయి.

ఇక ఈవారం డబ్బింగ్ సినిమాలకూ కొదవలేదు. విశేషం ఏమంటే... నాలుగు భాషలకు చెందిన అనువాద చిత్రాలు ఈ వీకెండ్ లో రాబోతున్నాయి. అందులో గత వారం తమిళంలో విడుదలైన విష్ణు విశాల్ 'ఆర్యన్' మూవీ 7న తెలుగులో విడుదల అవుతోంది. అలానే విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి నటించిన 'ఫీనిక్స్' కూడా తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో ప్రముఖ ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకుడిగా మారాడు. ఇదీ తమిళ్ లో ఆల్ రెడీ విడుదలైంది. అక్కడ సూర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు తెలుగులో తన లక్ ను పరీక్షించుకోబోతున్నాడు. అలానే మలయాళం ఇప్పటికే విడుదలైన 'డీయస్ ఈరే' మూవీ శని వారం తెలుగులో జనం ముందుకు వస్తోంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ నటిస్తున్న మిస్టరీ హారర్ థ్రిల్లర్ ను తెలుగులో స్రవంతి మూవీస్ సంస్థ పంపిణీ చేస్తోంది. దీనితో పాటు హాలీవుడ్ మూవీ 'ప్రెడేటర్: బ్యాడ్ లాండ్స్' సైతం తెలుగు వారి ముందుకు వస్తోంది. ఈసారి బాక్సాఫీస్‌లో పెద్ద సినిమాలు లేకపోవడంతో, చిన్న సినిమాలకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కంటెంట్ బలంగా ఉంటే ఏ సినిమా అయినా హిట్ అయ్యే అవకాశం ఉంది. మరీ బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న ఈ సినిమాల్లో ఏ సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారో చూడాలి.

Read Also: Spirit-Abhiram: హీటెక్కిస్తోన్న స్పిరిట్ అప్ డేట్స్

Read Also: Vrusshabha: మోహన్ లాల్ సినిమాకూ తప్పలేదు...

Updated Date - Nov 06 , 2025 | 07:14 PM