Rewind 2025: ఈ ఏడాది మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన దర్శకులు ఎవరంటే
ABN, Publish Date - Dec 30 , 2025 | 06:58 PM
ఈ ఏడాది తమ పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ (Music Directors)... వారి సరిగమలు ఎలా సంచరించాయో - పదనిసలు ఎలా పయనించాయో... చూద్దాం...
Rewind 2025: ఈ ఏడాది తమ పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ (Music Directors)... వారి సరిగమలు ఎలా సంచరించాయో - పదనిసలు ఎలా పయనించాయో... చూద్దాం...
తమన్.. మ్యూజిక్ బ్లాస్టర్
ఎస్.ఎస్. తమన్… ఈ పేరు వింటేనే స్పీకర్లు దడదడలాడాల్సిందే. రామ్ చరణ్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'లో ఆయన అందించిన పాటలు వరల్డ్ వైడ్‌గా మార్మోగాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'OG'కి తమన్ ఇచ్చిన ఎలివేషన్స్ అభిమానులకు పిచ్చెక్కించాయి. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్, అఖండ 2" వంటి భారీ చిత్రాలకు తమన్ అందించిన సౌండ్ క్వాలిటీ బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించింది. భారీ బడ్జెట్ సినిమాల స్థాయిని తన స్వరాలతో మరో మెట్టు ఎక్కించడంలో తమన్ దిట్ట అని ఈ ఏడాది మరోసారి నిరూపించుకున్నాడు.
మాస్ అండ్ క్లాస్ టచ్... భీమ్స్ ట్యూన్స్...
2025 బాక్సాఫీస్ వద్ద మోస్ట్ ఎనర్జిటిక్‌గా వినిపించిన పేరు భీమ్స్ సిసిలోరియో. ఈ ఏడాది ఆయన ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అందులో ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాకు భీమ్స్ అందించిన బీట్స్ థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. పల్లెటూరి నేటివిటీతో పాటు మాస్ జోష్‌ను అద్భుతంగా మిక్స్ చేయడంలో భీమ్స్ మ్యాజిక్ ఇక్కడ స్పష్టంగా కనిపించింది. అలాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'తో కుర్రకారును స్టెప్పులు వేయించారు. కేవలం ఐటెం సాంగ్స్‌కే పరిమితం కాకుండా, సినిమాలోని సన్నివేశాలను ఎలివేట్ చేసే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ ఏడాది భీమ్స్ ఒక ప్రభంజనం సృష్టించారు.
ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్... డీయస్పీ...
ఎనర్జీకి ప్రతిరూపం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ధనుష్, నాగార్జున కలయికలో వచ్చిన భారీ మల్టీస్టారర్ 'కుబేర'కు డీఎస్పీ అందించిన సంగీతం ఈ ఏడాది హైలైట్ అనే చెప్పాలి. స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా ఆయన ఇచ్చిన థీమ్ మ్యూజిక్స్ సోషల్ మీడియాను ఊపేశాయి. అలాగే నాగ చైతన్య 'తండేల్' లో కోస్టల్ బెల్ట్ నేటివిటీని తన స్వరాల్లో పండించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మాస్ బీట్స్ తో థియేటర్లను షేక్ చేయడమే కాకుండా, మెలోడీలను ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి.
ఆగని అనిరుధ్ జోరు...
ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. నేటి తరం సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ అనిరుధ్‌కు ఒక రేంజ్ క్రేజ్ ఉంది. ఈ ఏడాది విడుదలైన 'కింగ్‌డమ్' సినిమాతో అనిరుధ్ తనదైన బాణీ పలికించారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన 'కూలీ'లో మోనికా సాంగ్‌తో అనిరుధ్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఈ సాంగ్ వినడానికే ఆడియన్స్ థియేటర్లకు పరుగులు తీశారంటే అనిరుధ్ మ్యూజిక్ పవర్ ఏంటో అర్థం అవుతుంది.
కీరవాణి రాగం... పిలిచింది...
ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ ఏడాది కూడా తన రాచరికపు సంగీతంతో ఆకట్టుకున్నారు. 'హరి హర వీరమల్లు' వంటి పీరియాడికల్ మూవీకి ఇచ్చిన బాణీలు సినిమాకు ఆత్మగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ ఎనర్జీని, పీరియాడికల్ సెటప్ కు కావాల్సిన క్లాసికల్ టచ్ ను బ్యాలెన్స్ చేస్తూ.. అదిరిపోయే మ్యూజిక్ అందించారు కీరవాణి.
మ్యూజిక్ మిరకిల్స్...
మెలోడీలకు చిరునామాగా నిలిచే మిక్కీ జే మేయర్....ఈ ఏడాది తనలోని సరికొత్త కోణాన్ని బాక్సాఫీస్‌కు పరిచయం చేశారు. తన మ్యూజిక్‌తో నాని 'హిట్-3'ని నిలబెట్టాడు. ఇక క్రిస్మస్ కానుకగా వచ్చిన 'ఛాంపియన్' సినిమాలో మిక్కీ మ్యాజిక్ పీక్స్‌కు చేరిందని చెప్పాలి. పరిశ్రమలో పేరు తక్కువగా వినిపించినా, తన పనితనం అద్భుతంగా చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన యువ కెరటం గౌరహరి. గత ఏడాది 'హనుమాన్' సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సంవత్సరం 'మిరాయ్' సినిమాతో మరో మెట్టుకు ఎక్కాడు. కేవలం అదరిపోయే బ్యాకగ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు.. తనలోనూ గట్టి వైబ్ ఉందని నిరూపించుకున్నాడు.
చిన్న చిత్రాల మ్యూజికల్ మ్యాజిక్
ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే ఎక్కువ సందడి చేశాయి. కంటెంట్ ఉన్న చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా 'కోర్ట్' సినిమా గురించి చెప్పుకోవాలి. విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ప్రాణం పోసింది. అలాగే 'లిటిల్ హార్ట్స్' సినిమాతో సింజిత్ యెర్రమిల్లి కుర్రకారును ఫిదా చేశారు. మరోవైపు 'రాజు వెడ్స్ రాంబాయి' అంటూ సురేశ్ బొబ్బిలి తన అద్భుతమైన సంగీతంతో మాయ చేశారు. ఇందులోని 'రాంబాయి' సాంగ్ ప్రతి ఒక్కరి ప్లే లిస్ట్‌లో చేరిపోయింది. ఇక ఆర్.ఆర్. ధ్రువన్ మ్యూజిక్ ఇచ్చిన 'మిత్ర మండలి' కూడా మ్యూజికల్ హిట్ గా నిలిచి ప్రేక్షకులను అలరించింది. ఇలా 2025లో తమదైన బాణీ పలికించిన ఈ మ్యూజిక్ డైరక్టర్స్ రాబోయే 2026లో ఏ తీరున అలరిస్తారో చూడాలి..