సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Theaters Bandh: థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారం.. జ‌న‌సేన నేత సస్పెండ్‌

ABN, Publish Date - May 27 , 2025 | 08:29 PM

గ‌త వారం ప‌దిరోజులుగా తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా ఉన్న థియేట‌ర్ల బంద్ విష‌యంలో మంగ‌ళ‌వారం మ‌రో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది.

janasena

గ‌త వారం ప‌దిరోజులుగా తెలుగు రాష్ట్రాల‌లో హాట్ టాపిక్‌గా ఉన్న థియేట‌ర్ల బంద్ (Theaters Bandh) విష‌యంలో మంగ‌ళ‌వారం మ‌రో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. థియేటర్ బంద్ వెనక జనసేన పార్టీ (Janasena Party) కీల‌క నేత‌, అనుశ్రీ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట‌ర్‌ సత్యనారాయణ ఉన్నట్లు ఆరోపణల నేప‌థ్యంలో నిజనిజాలు తేలే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం ఆదేశించింది. రాజమండ్రి ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి అత్తి సత్యనారాయణను (Rajahmundry in charge Atti Satyanarayana) తొలగిస్తున్న‌ట్లు పార్టీ పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు ఈ విష‌యం అటు సినీమాతో పాటు, రాజ‌కీయాల్లోనూ సంచ‌ల‌నంగా మారింది.

సినిమా హాళ్ల బంద్ ప్రకటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలని ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని అన్న‌ డిప్యూటీ సీఎం స్ప‌ష్టం చేయ‌డంతో థియేటర్ల బంద్‌కు సంబంధించి మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు విచారణ చేపట్టగా.. ఈ వ్యవహారంలో సత్యనారాయణ పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అంతే కాకుండా థియేటర్ల బంద్ అంశం తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రారంభమైందని, అక్కడి నుంచే తెలంగాణకు ఆపాదించారంటూ దిల్‌ రాజు కూడా చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో వెంటనే అప్రమత్తమైన జనసేన అధిష్టానం దీనిపై విచారణ జరిపి సత్యనారాయణ ప్రమేయం ఉన్నట్లు తేల్చారు.

ఈ నేపథ్యంలో సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ జనసేన అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేర‌కు జనసేన నేత వేముల అజయ్ కుమార్ పేరుతో సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు. ‘థియేటర్ల బంద్ వ్యవహారంలో మీ పాత్ర ఉన్నట్లు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అందువల్ల మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నాం. ఈ వ్యవహారంలో మీ ప్రమేయం లేదని నిర్ధారించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటాం’ అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంలో సత్యనారాయణతో పాటు ఇంకెవరెవరి పాత్ర ఉంది అనేదానిపై ఆరా తీయనున్నారు. ఈ వ్యవహారంలో జనసేన పార్టీ నేతలు ఉన్నా చర్యలు తప్పవంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించిన గంటలోనే అత్తి సత్యనారాయణ తొలగింపు ప్రకటన బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - May 27 , 2025 | 08:29 PM