The Face of the Faceless: తెలుగులో రాబోతున్న అవార్డ్ విన్నింగ్ మూవీ
ABN, Publish Date - Nov 12 , 2025 | 05:06 PM
కాథలిక్ మత ప్రచారకురాలు మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్ లెస్' సినిమా నవంబర్ 21న తెలుగులో విడుదల కాబోతోంది.
కాథలిక్ మత ప్రచారకురాలు, సామాజిక కార్యకర్త రాణి మరియా వట్టాలిల్ నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న సినిమా 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్ లెస్' (The Face of the Faceless). ఈ చిత్రంలో సిస్టర్ రాణి మరియా (Sister Rani Maria) అణగారిన వర్గాల కోసం, మహిళా సాధికారత కోసం చేసిన కృషిని చూపించారు. ఇందులో సిస్టర్ రాణి మరియా పాత్రను విన్సీ అలోషియస్ పోషించారు.
ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన 'ది ఫేస్ ఆఫ్ ది ఫేస్ లెస్' సినిమా 2024లో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది. ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సహకారంతో నవంబర్ 21న తెలుగు వెర్షన్ ను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఒకప్పటి హీరో రాజా (Raja), దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ సి.ఎస్.ఐ. బిషప్ విల్సన్, నటుడు జక్కల కృష్ణమోహన్, దర్శకుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నటుడు రాజా మాట్లాడుతూ, 'ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్ కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్ గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మరియా త్యాగం గురించిన సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా 123 అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. ఇలాంటి సినిమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి' అని అన్నారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ, *గొంతుక లేని వారికి గొంతుక అందించే సినిమా ఇది. మన సమాజంలో ప్రేమ గురించి, శాంతి గురించి క్షమాపణ విలువను ఈ సినిమా తెలుపుతుంది. తెలుగు రాష్ట్రాలలో 50-60 థియేటర్ లలో విడుదల కానుంది' అని చెప్పారు. ఈ సినిమాలో హరిహరన్, చిత్ర వంటి దిగ్గజ గాయనీ గాయకులు పాటలు పాడారని తెలిపారు.
Also Read: Rahul Ravindran: అమ్మాయి చున్నీ తీయడం.. విమెన్ ఎంపవర్ మెంటా
Also Read: Govinda: నేను క్షేమంగా ఉన్నా.. మీడియాతో మాట్లాడిన గోవిందా