NTR: అనితరసాధ్యం ఎన్టీఆర్ బొబ్బిలిపులి రికార్డ్
ABN , Publish Date - Jul 09 , 2025 | 07:37 PM
నలభై మూడేళ్ళ క్రితం జూలై 9వ తేదీన విడుదలైన 'బొబ్బిలిపులి' చిత్రం ఆ రోజుల్లోనే అదరహో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలు మినహాయిస్తే ఆ రోజున 'బొబ్బిలిపులి'కి ఇప్పటిలా ఆల్ ఇండియా స్థాయిలో వేల థియేటర్లు లభించలేదు. అప్పట్లో దక్షిణాదిన ఒకేసారి 100 థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా 'బొబ్బిలిపులి' సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం టాప్ టెన్ ఆల్ ఇండియా గ్రాసర్స్ లో 4 తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ టెన్ లో 6 తెలుగు సినిమాలు చోటు చేసుకున్నాయి. వీటిని చూసి తెలుగువారు గర్విస్తున్న రోజులివి. అయితే 43 ఏళ్ళ క్రితం జూలై 9వ తేదీన విడుదలైన 'బొబ్బిలిపులి' (Bobbili Puli) చిత్రం ఆ రోజుల్లోనే అదరహో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలు మినహాయిస్తే ఆ రోజున 'బొబ్బిలిపులి'కి ఇప్పటిలా ఆల్ ఇండియా స్థాయిలో వేల థియేటర్లు లభించలేదు. అప్పట్లో దక్షిణాదిన ఒకేసారి 100 థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా 'బొబ్బిలిపులి' సంచలనం సృష్టించింది.
నటరత్న యన్టీఆర్ (NTR) - దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కాంబోలో వచ్చిన ఐదో చిత్రం 'బొబ్బిలిపులి'. ఈ సినిమాలో అప్పటి ప్రభుత్వాలను ఎండగట్టే అంశాలున్నాయని తెలుసుకున్న పెద్దలు 'బొబ్బిలిపులి'ని సెన్సార్ బోనులో బంధించి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారు. అయితే యన్టీఆర్ అభిమానులు అనేక కేంద్రాలలో చేసిన ఆందోళన కారణంగా కొన్ని కట్స్ తో 'బొబ్బిలిపులి'ని విడుదల చేయడానికి సెన్సార్ అంగీకరించింది. అప్పటికే యన్టీఆర్ 'తెలుగుదేశం' (Telugu Desam) పార్టీ నెలకొల్పారు. అందువల్ల కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 'బొబ్బిలిపులి' విడుదలకు పలు అడ్డంకులు కల్పించింది. చివరకు అభిమానగణాల ఆందోళన విజయం సాధించింది. 'బొబ్బిలిపులి' సర్టిఫికెట్ రాగానే జూలై 9 విడుదల అని 'ఈనాడు' దినపత్రికలో ఫుల్ పేజ్ యాడ్ వేశారు. దాంతో అన్న అభిమానులు ఆనందంతో చిందులు వేశారు. ఇప్పటి హీరోల్లా ఏడాదికో, రెండేళ్ళకో ఓ సినిమా విడుదల చేస్తున్న రోజులు కావు. అలాగే తమ హిట్ మూవీస్ రన్నింగ్ బాగుంటే కూడా ఇప్పటి స్టార్స్ తమ కొత్త చిత్రాలను విడుదల చేయడానికి తటపటాయిస్తున్నారు. అప్పటికే యన్టీఆర్ 'జస్టిస్ చౌదరి' విడుదలై విజయవిహారం చేస్తోంది. ఆ సినిమా విడుదలైన కేవలం 42 రోజులకే 'బొబ్బిలిపులి' విడుదల కావడం గమనార్హం!
'బొబ్బిలిపులి' చిత్రం మొదటి రోజునే రూ. 13 లక్షల, 22 వేల, పద్నాలుగు రూపాయల 91 పైసలు పోగేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పట్లో నేల క్లాస్ కొన్ని చోట్ల 41 పైసలు, మరికొన్ని కేంద్రాలలో 55 పైసలు ఉండేది. తరువాత బెంచి రూపాయి, బాల్కనీ రూ.1.55, హై క్లాస్ రూ. 2 మాత్రమే. ఏవో కొన్ని పెద్ద కేంద్రాలలో మాత్రమే టిక్కెట్ రేటు ఓ రూపాయి అధికం. అంతకు మించి ఏలాంటి ఎక్స్ ట్రా రేట్స్ ఉండేవి కావు. అలాంటి రేట్లతో మొదటి రోజునే రూ. 13 లక్షలకు పైగా పోగేసిన 'బొబ్బిలిపులి' అఖండ విజయం చూసి దక్షిణాది మాత్రమే కాదు ఉత్తరం సైతం ఉలిక్కి పడింది. అప్పట్లో ఈ వసూళ్ళు కొన్ని పెద్ద సినిమాల మొదటి వారం కలెక్షన్స్ తో సమానం.
ఇక 'బొబ్బిలిపులి' మొదటి వారం వసూళ్ళు రూ. 71 లక్షల, 60 వేల 708. ఈ మొత్తం ఒక రాష్ట్రంలోనే సంపాదించడం ఆ రోజుల్లో చర్చనీయాంశమయింది. ఈ వసూళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిన ఇతర హీరోల సినిమాల టోటల్ రన్ కు సమానం. ఈ మొత్తాన్ని ఈ నాటి లెక్కలకు సవరించి చూస్తే రూ.200 కోట్లకు ఏ మాత్రం తగ్గవు. అందునా 'బొబ్బిలిపులి' కేవలం 100 థియేటర్లలో మాత్రమే విడుదలయిందన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి. అలాగే ఏ లాంటి ఎక్స్ ట్రా రేట్స్ కూడా లేని రోజులనీ మరువరాదు.
తెలుగునాట యన్టీఆర్ చిత్రాల హవా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 'సోలో' హీరోగా ఆయన సినిమాలు సాధించిన వసూళ్ళను ఏదో రెండు మల్టీస్టారర్ 'రామకృష్ణులు', 'సత్యం-శివం' (వాటిలోనూ యన్టీఆర్ నటించారు) మినహాయిస్తే అన్నీ యన్టీఆర్ సోలోగా నటించిన చిత్రాలు రికార్డులు నెలకొల్పాయి. 1977లో 'అడవిరాముడు' (Adavi Ramudu) చిత్రం మొదటివారం 23 లక్షలు వసూలు చేసింది. ఆ తరువాత దానిని 1978లో 'రామకృష్ణులు' (Ramakrishnulu) అధిగమించింది. దానిని 1979లో 'వేటగాడు' (Vetagadu), అదే యేడాది ఆ మొదటివారం వసూళ్ళను 'యుగంధర్' అధిగమించాయి. వీటిని 1980లో వచ్చిన యన్టీఆర్ 'ఛాలెంజ్ రాముడు' మొదటి వారం రూ.31 లక్షలతో దాటేసింది. తరువాత 'సర్కస్ రాముడు', 'సూపర్ మేన్', 'సర్దార్ పాపారాయుడు' చిత్రాలన్నీ పాతిక లక్షలు, అంతకు మించి, 29 లక్షల రూపాయలతో సాగాయి. 1981లో వచ్చిన 'గజదొంగ' చిత్రం రూ. 34 లక్షలు సాధించగా, అదే యేడాది వచ్చిన 'కొండవీటి సింహం' దానిని అధిగమించింది. ఇలా యన్టీఆర్ చిత్రాల వసూళ్ళ రికార్డులను ఆయన సినిమాలే అధిగమిస్తూ సాగాయి. ఆ పై 'బొబ్బిలిపులి' అన్ని రికార్డులనూ తిరగరాసింది. దీని తరువాత యన్టీఆర్ 'నా దేశం' ఈ స్థాయిలో కాకపోయినా భారీగానే వసూళ్ళు చూసింది. ఇలా 1977 నుండి 1982 మధ్య కాలంలో మొదటి వారం రూ.23 లక్షలకు పైగా వసూలు చేసిన 13 చిత్రాలు కలిగిన ఏకైక హీరోగా యన్టీఆర్ నిలిచారు. ఐదారేళ్ళయినా మొదటి వారం కలెక్షన్స్ రూ. 23 లక్షలకు పైగా 13 సార్లు యన్టీఆరే సాధించారు తప్ప వేరే వారికి ఛాన్స్ దక్కలేదు. రూ.71 లక్షలతో యన్టీఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వేరే స్టార్ హీరోస్ లో ఏయన్నార్ ' శ్రీవారి ముచ్చట్లు' మొదటి వారం రూ. 22 లక్షలతో రెండో స్థానంలో నిలచింది. ఇక మూడు నాలుగు ఐదు స్థానాల్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు చిత్రాలు ఉండేవి. వీరి నలుగురి ఓపెనింగ్స్ అన్నీ కలిపినా ఒక్క 'బొబ్బిలి పులి' మొదటి వారం అంత ఉండకపోవడం గమనార్హం! తనతో రేసులో ఉన్న ఇతర స్టార్స్ చిత్రాల ఫస్ట్ వీక్ టాప్ కలెక్షన్స్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఒక హీరో (యన్టీఆర్) సినిమా సాధించడం చరిత్రలోనే అంతకు ముందుగానీ, ఆ తరువాత ఇప్పటివరకుగానీ ఎక్కడా కనీ వినీ ఎరుగని అంశం! ఆ తరువాత రాజకీయరంగంలో సాగినా, 1984లో 'వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర'తో దక్షిణాదిన మొదటి వారమే కోటి రూపాయలుపైగా చూపిన ఘనత కూడా యన్టీఆర్ దే! ఆ రోజుల్లో సౌత్ లో 100 ప్రింట్లతో విడుదలైన తొలిచిత్రంగానూ 'బ్రహ్మంగారి చరిత్ర' నిలచింది. యన్టీఆర్ చిత్రసీమలో ఉన్నంత వరకు వసూళ్ళ వర్షాలు కురిపించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు.
Also Read: NTR: కాస్ట్యూమ్ డిజైనర్ వాలేశ్వరరావుతో స్పెషల్ చిట్ చాట్
Also Read: Badass: బ్యాడాస్ టైటిల్ పై త్రివిక్రమ్ అభిమానులు ఆవేదన