TFPC Declares: యూనియన్‌తో పనిలేదు నైపుణ్యం ఉంటే చాలు
ABN, Publish Date - Aug 05 , 2025 | 06:47 AM
వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ కార్మికుల సమ్మె డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గకూడదని నిర్మాతలంతా ఏకాభిప్రాయంతో ఓ గట్టి నిర్ణయం...
ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం
వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేస్తున్న సమ్మె వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ కార్మికుల సమ్మె డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గకూడదని నిర్మాతలంతా ఏకాభిప్రాయంతో ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యూనియన్ సభ్యులతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. రేపో మాపో తమ డిమాండ్లకు నిర్మాతలు అంగీకరించి తమ దారికి రాక తప్పదని ధీమాతో ఉన్న ఫెడరేషన్‌కు ఈ నిర్ణయం ఊహించని షాక్‌లాంటిది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ అడుగు ముందుకు వేసి అనుభవం, ప్రతిభ కలిగిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తామంటూ.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు అధికారిక వెబ్‌సైటును, మెయిల్ ఐడీని జత చేసింది.
మోయలేని భారం... అందుకే ఈ నిర్ణయం
ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నుంచి సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. వర్కర్లకు 30శాతం వేతనం పెంచిన నిర్మాతల సినిమాలకు పనిచేసి, ఇవ్వని వారి సినిమాల షూటింగ్స్‌కు వెళ్లకూడదని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ సోమవారం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘తెలుగు చిత్రపరిశ్రమ ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో వేతనాలు పెంచాలనడం, కార్మిక శాఖ కమిషనర్ మార్గదర్శకత్వంలో సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్న సందర్భంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదు. లేబర్ కమిషనర్ మాటను ధిక్కరిస్తూ, ఈ రోజు (సోమవారం) నుంచి 30శాతం వేతనం పెంపు ఇస్తామన్న ప్రొడ్యూసర్ నుంచి ఒప్పంద పత్రం తీసుకుని, సంబంధిత పత్రాన్ని ఫెడరేషన్ ద్వారా యూనియన్లకు తెలియజేశాకే విధులకు వెళ్లాలని వారు నిర్ణయించడం బాధాకరం. ఇది నిజాయితీతో కూడిన చర్చల స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. వేతనాలు పెంపుదల చిన్న నిర్మాతలకు ఆమోదయోగ్యం కాదు. దానిని వారు భరించే స్థాయిలో లేరు. అందుకే ఈ వేతనాల పెంపును నిర్మాతలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. కనీస వేతనాల చట్టం ప్రకారం ఏ కార్మికుడినైనా నియమించుకునే హక్కు నిర్మాతలకు ఉందని కార్మిక శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. అదనంగా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కూడా నిర్మాతల స్వయంప్రతిపత్తిని సమర్థిస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఫెడరేషన్ల ఒత్తిడి, పోటీని నిరోధించే పద్థతులను ఖండిస్తూ, అలాంటి నిబంధనలను అమలు చేయకుండా నిరోధించింది. అన్ని యూనియన్ల వారికి ఇతర రాష్ట్రాల్లో కంటే మనమే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామనేది గమనించాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ఏకగ్రీవంగా ఒక తీర్మానం తీసుకుంది. దీని ప్రకారం ఎవరికైతే మంచి నైపుణ్యం ఉండి, తగిన వేతనానికి పనిచేస్తారో.. వారు యూనియన్లో ఉన్నా లేకున్నా వాళ్ళతో పని చేయించుకోవడానికి నిర్మాతలు సిద్థంగా ఉన్నారు. నిర్మాత లేనిదే సినిమా పరిశ్రమ లేదు. మన చలనచిత్ర మనుగడ కోసం నిర్మాత శ్రేయస్సు అతి ముఖ్యమైన విషయం అని కార్మిక సంఘాలు మరొక్కసారి గుర్తించాలి’’ అని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది.
సమ్మె నిర్ణయం.. సినిమాలపై, నిర్మాతలపై ప్రభావం
సినీ కార్మికుల సమ్మె ప్రభావం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలపై పడనుంది. షూట్ ఆగిపోవడంతో ఖర్చులు మరింత పెరుగుతాయి. సంబంధిత నటుల కాల్షీట్లు వృధా అవుతాయి, సినిమా సామాగ్రితో పాటు తదితర పనులకు అద్దెలు కూడా అదనపు భారంగా మారుతాయి. సోమవారం ఉదయం పవన్‌కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. సోమవారం నుంచి పవన్‌కల్యాణ్ ఇందులో పాల్గొనాల్సి ఉంది. సమ్మెకారణంగా ముంబై నుంచి కార్మికులను తెప్పించి చిత్రీకరణ రిహార్సల్స్‌ను మొదలుపెట్టారు మేకర్స్. అయితే, బంద్‌కు పిలుపునిచ్చిన తరుణంలో బయటినుంచి కార్మికులను రప్పించి షూట్ చేయడమేంటంటూ మేకర్స్‌పై మండిపడి వారి ప్రయత్నాలకు సినీ కార్మికులు అడ్డు పడి నిలిపివేశారు ఇటువంటి నేపథ్యంలో యూనియన్ సభ్యులు కాని వారిని నిర్మాతలు ప్రోత్సహించాలని నిర్ణయించుకోవడంతో ఏం జరుగుతుందో, ఫెడరేషన్ ఎలా స్పందిస్తుందో ఎదురు చూద్దాం.