Cinema Bandh: కందుల దుర్గేష్ తో నిర్మాతల సమావేశం

ABN , Publish Date - Aug 11 , 2025 | 01:16 PM

తెలుగు సినిమా రంగానికి చెందిన పలువురు నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయ్యారు. సినిమా రంగానికి సంబంధించిన సమస్యలతో పాటు, ప్రస్తుతం జరుగుతున్న బంద్ గురించి ఆయనకు వివరిస్తున్నారు.

Kandula Durgesh

తెలుగు సినీ కార్మికులు (Telugu Film employees) గత సోమవారం నుండి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఈ విషయమై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber), ఎంప్లాయిస్ ఫెడరేషన్, లేబర్ కమీషనర్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే రోజు రోజుకూ ఈ సమస్య చినికి చినికి గాలివానగా మారుతోంది తప్పితే పరిష్కారం దిశగా సాగడం లేదు. ఒక అడుగు ముందుకు పడుతుంటే రెండు అడుగులు వెనక్కి పడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నాం తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) తో సచివాలయంలో సమావేశం అయ్యారు. దాదాపు పదిహేను మంది నిర్మాతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.


గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై మంత్రితో వీరు చర్చించబోతున్నారు. అలానే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలపై వీరు మంత్రి దుర్గేష్ ఓ వినతిపత్రం సమర్పించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో బి వి ఎస్ ఎన్ ప్రసాద్, డి వి వి దానయ్య, కె ఎల్ నారాయణ, భరత్ ( ఛాంబర్ ప్రెసిడెంట్), నాగ వంశీ, యెర్నేని రవిశంకర్, విశ్వ ప్రసాద్, బన్నీ వాసు, యువీ క్రియేషన్స్ వంశీ, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు కందుల దుర్గేష్‌ ఏబీయన్ తో మాట్లాడుతూ, 'సినీ కార్మికుల సమ్మెకు సంబంధించి ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదని, అది ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ మధ్య జరగాల్సిన ఒప్పందమ'ని తెలిపారు. సినిమా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం పట్ల ఏపీ ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే ఉంటుందని, ఏపీలో సినిమా పరిశ్రమ స్థిరపడాలన్నదే తమ అభిప్రాయమని అన్నారు. నిర్మాతలతో భేటీ అయిన తర్వాత ఆ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తాను తీసుకెళతానని తెలిపారు.

Also Read: Mass Jathara: కొత్తదనం లేని ‘మాస్ జాతర’ టీజర్.. రియాక్ష‌న్‌

Also Read: Kamal Haasan: కమల్ హాసన్‌పై.. సీరియ‌ల్‌ ఆర్టిస్ట్‌ హత్యా బెదిరింపులు!

Updated Date - Aug 11 , 2025 | 03:41 PM