సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: సోమవారం నుండి.. సినిమా షూటింగ్స్ బంద్

ABN, Publish Date - Aug 03 , 2025 | 07:04 PM

తెలుగు సినిమాలు షూటింగ్స్ బంద్ కాబోతున్నాయి. తాము కోరిన విధంగా 30 శాతం వేతనాలను పెంచకపోతే సోమవారం నుండి షూటింగ్స్ లో పాల్గొనకూడదని సినీ కార్మికుల సంఘం నిర్ణయించింది.

Telugu Film Employees Federation

మొన్నటి వరకూ థియేటర్లకు సరైన ఫీడ్ లేదని, రెంట్ గిట్టుబాటు కావడం లేదని దాంతో సినిమా హాల్స్ మూసేస్తామని సింగిల్ స్క్రీన్ యాజమాన్యం చెబుతూ వచ్చింది. వారి సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక కమిటీ వేసి... ఓ సానుకూల మార్గాన్ని అన్వేషించే పనిలో పండింది. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Telugu Film Industry Employees Federation) తమ వేతనాలను 30 శాతం పెంచాలని కరాఖండిగా తెలిపింది. గత కొన్ని రోజులుగా ఈ విషయమై సంబంధిత శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే అవేవీ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఫెడరేషన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. అందులో కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు.

వాటి ప్రకారం వేతనాలు పెంచు విషయంలో కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్లుగా సయ్యద్ హ్యూమయున్, వీరశంకర్ (Veerasankar) లను నియమించారు. సోమవారం నుండి 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాల్సిందేనని నిర్ణయించారు. అలా ఇవ్వడానికి సిద్థపడి లేఖ ఇచ్చిన నిర్మాతల షూటింగ్స్ కు మాత్రమే సినిమా కార్మికులు వెళ్ళాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని 24 యూనియన్ల నాయకులకు తెలిపారు. అలా అంగీకరించని ఏ నిర్మాత సినిమా, వెబ్ సీరిస్ షూటింగ్ లలో కార్మికులు పాల్గొనకూడదని నిర్ణయించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తెలుగు సినిమా షూటింగ్ ఎక్కడ జరిగినా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. అలానే తెలుగు నిర్మాతలు తీసే పరభాషా చిత్రాలకూ ఇది అమలవుతుందని అంటున్నారు. అలానే పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలనే షరతూనే విధిస్తున్నట్టు తెలుస్తోంది.

ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారి అలెగ్జాండర్ సంతకాలతో లెటర్ హెడ్ పై తమ నిర్ణయాలను ఫెడరేషన్ తెలియచేసింది. ఫెడరేషన్ నిర్ణయాన్ని నిర్మాతలు వెంటనే అంగీకరిస్తారన్నది సందేహమే... గత కొంతకాలంగా సరైన విజయాలు లేక కొట్టుమిట్టాడుతున్న చిత్రసీమ ఈ వేతన భారాన్ని ఎంతవరకూ మోస్తుందో చూడాలి. ఏదేమైనా ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంతో సోమవారం నుండి సినిమా షూటింగ్స్ బంద్ అవుతాయనే అనిపిస్తోంది.

Updated Date - Aug 03 , 2025 | 07:34 PM