సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: తగ్గేదే లే అంటున్న ఛాంబర్... బంద్ పక్కా...

ABN, Publish Date - Aug 03 , 2025 | 10:44 PM

సోమవారం నుండి వేతనాలు పెంచకపోతే షూటింగ్స్ కు హాజరు కామని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తేల్చి తెప్పింది. ఇప్పటికే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం... ఇప్పట్లో పెంచేదే లేదని ఫిల్మ్ ఛాంబర్ అంటోంది. నిర్మాతలెవరూ స్వంత నిర్ణయాలు తీసుకోవద్దని కూడా ఛాంబర్ తాజాగా ఓ ప్రకటన వెలువర్చింది. దీంతో రేపు షూటింగ్స్ బంద్ ఖాయమని తేలిపోయింది.

Film Shootings Bandh

సోమవారం నుండి తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్ అనేది ఖాయమైపోయింది. ముప్పై శాతం వేతనాలు పెంచితే కానీ షూటింగ్స్ లో సినిమా కార్మికులు పాల్గొనరని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆదివారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో నిర్ణయం తీసుకోగా... తాజాగా ఈ నిర్ణయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తప్పు పట్టింది. ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ పేరుతో ఓ లేఖను మీడియాకు విడుదల చేసింది. అందులో నిర్మాతలను ఉద్దేశించి రాస్తూ, 'ఫెడరేషన్ పక్షపాతంగా 30 శాతం వేతనాల పెంపుకు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలకు భారీ నష్టం జరుగుతుంది. సమస్య పరిష్కారం కోసం ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు స్వతంత్ర చర్యలు లేదా సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకూడదు. ఛాంబర్ జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించాలి. శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి' అని అందులో పేర్కొంది.

ఇదిలా ఉంటే... సినీ కార్మికుల బంద్ కారణంగా సోమవారం మొదలు కావాల్సిన 'అల్లరి' నరేశ్‌ షూటింగ్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకున్నారు. అయితే... ఈ సమస్యకు త్వరిత గతిన పరిష్కారం ఆలోచించడం కోసం సోమవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు సమావేశం కానున్నారు.

Updated Date - Aug 03 , 2025 | 10:44 PM