23 Movie: దళితులకు అన్యాయం.. ఓటీటీలో అదరగొడుతున్న సినిమా

ABN , Publish Date - Jun 29 , 2025 | 05:08 PM

ఈమధ్యకాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు. కంటెంట్ బావుంటే సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు.

23 Movie

23 Movie: ఈమధ్యకాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు. కంటెంట్ బావుంటే సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు. ఇక థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేని చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఓటీటీలో అలాంటి సినిమాలు చూసిన ప్రేక్షకులు అరెరే ఈ సినిమా థియేటర్ లో చూస్తే ఇంకా బావుండేదే అని ఫీల్ అవుతారు. అలాంటి ఫీల్ ఇచ్చిన మూవీస్ లో 23 (Iravai Moodu) ఒకటి.


మల్లేశం, 8 AM మెట్రో లాంటి సినిమాలతో మంచి డైరెక్టర్ అనిపించుకున్న రాజ్ రాచకొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ, తన్మయి, ఝాన్సీ, పవోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ కీలక పాత్రల్లో నటించారు. 1993లో చిలకలూరి పేట బస్సు దహనం సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 16 న రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. చట్టం దృష్టిలో అందరూ సమానం కాదని, కొందరికి చట్టం చుట్టమని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు.


ఇక ఈ సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా ఓటీటీలో దుమ్ము రేపుతోంది.జూన్ 27 నుంచి 23 మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక చిన్న తప్పు దళితుల ఊచకోత, జైలు జీవితం, అణచివేతలు ప్రతిదాన్ని ఇందులో చూపించాడు దర్శకుడు. దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన చుండూరు మారణకాండ, జూబ్లీహిల్స్ బాంబ్ పేలుడు అంశాలను కూడా ఎంతో హృద్యంగా చూపించాడు.


23 కథ ఏంటంటే.. సాగర్ సొంతంగా ఒక ఇడ్లీకొట్టు పెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. దానికోసం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు డబ్బు కూడా ముట్టజెప్తాడు. కానీ, అధికారులు ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇంకోపక్క సాగర్, సుశీలను ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటాము అనే నమ్మకంతో వారు ఒకటి అవుతారు. దీంతో సుశీల గర్భవతి అవుతుంది. ఇక వెంటనే సుశీలను పెళ్లి చేసుకొనే పరిస్థితి వస్తుంది. ఆమెను పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండాలంటే.. ఏదోకటి చేయాలనీ స్నేహితుడుతో కలిసి చిలకలూరి పేట బస్సును అడ్డుకొని ప్రయాణికుల వద్ద బంగారం, డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే అనుకోకుండా ఆ బస్సు దహనం అవుతుంది. అందులో 23 మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ తరువాత సాగర్ జీవితం ఏమైంది.. ? సుశీలను పెళ్లి చేసుకున్నాడా.. ? కోర్టు వారికి ఎలాంటి తీర్పును ఇచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. చిన్న కథ కూడా చివరికి గొప్ప సందేశం ఇచ్చిన సినిమా 23. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Actress Pakeezah: మీ కాళ్లు పట్టుకుంటా ఆదుకోండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న సీనియర్ నటి వీడియో

Updated Date - Jun 29 , 2025 | 06:07 PM